ముగ్గురు పిల్లలతో చెరువులో దూకిన ఇల్లాలు, ఒక చిన్నారి సురక్షితం
మన తెలంగాణ/మేడ్చల్ : కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడే నిత్యం అనుమానిస్తూ వేధింపులకు గురిచేయడంతో తట్టుకోలేక ఓ గృహిణి పిల్లలతో సహా చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. తల్లి ఇద్దరు పిల్లలు మృతిచెందగా మరొక బాబు సురక్షితంగా బయటపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నూతనకల్ గ్రామానికి చెందిన మమతకు మేడ్చల్ మండలం రాజబొల్లారం గ్రామానికి చెందిన ప్లంబర్ పనిచేసే బ్రాహ్మణపల్లి బిక్షపతి 7 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి జగదీష్, ప్రణతి, దీక్షిత్ ముగ్గురు పిల్లలున్నారు. వివాహమైనప్పటి నుండి బిక్షపతి అనుమానంతో మమతను వేధింపులకు గురిచేసేవాడు. ఈ క్రమంలో ఓసారి విషయం పెద్ద మనుషుల వరకు వెళ్లడంతో పంచాయితీ పెట్టి ఇరువురికి నచ్చజెప్పి కలిసిమెలిసి ఉండాలని సూచించారు. అయినప్పటికీ బిక్షపతిలో మార్పు రాలేదు. పిల్లలు పుట్టినా బిక్షపతి వేధింపులు ఆపలేదు. దీనితో కుటుంబంలో నిత్యం గొడవలు జరుగుతుండేవి. 2, 3 నెలల నుండి గొడవలు ఎక్కువయ్యాయి. మూడు రోజులుగా బిక్షపతి మమతను కొట్టడంతోపాటు ఒంటిపై సెగరెట్‌తో కాల్చాడు.
బుధవారం ఉదయం కూడా పిల్లలను అంగన్‌వాడీ కేంద్రానికి ఎందుకు పంపించలేదని భిక్షపతి ఆమెపై చేయి చేసుకున్నాడు. దీనితో మమత పిల్లలను తీసుకుని అంగన్ వాడీ కేంద్రానికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వ్యవసాయ పొలం పక్కన ఉన్న చెరువు వద్దకు వెళ్లింది. ప్రణతి, దీక్షిత్‌లను కొంగుకు కట్టుకుని, జగదేష్‌ను చేతిలో పట్టుకుని చెరువులోకి దూకింది. చెరువు నీటిలో మునిగి మమత (28) ప్రణతి (3), దక్షిత్ (1)లు మృతిచెందగా జగదేష్(6) సురక్షితంగా బయటపడ్డాడు. అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లిన మమత తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన బంధువులు అంగన్‌వాడీ కేంద్రం వద్దకు వెళ్లిన పిల్లలు కనిపించలేదు. దీంతో వ్యవసాయ పొలం వద్దకు వెళ్లారు. పక్కనే గల చెరువు నుండి జగదీష్ అరుపులు వినపడటంతో వెళ్లి చూడగా అప్పటికే మమత, ప్రణతి, దీక్షిత్ మృతి చెందారు. సమాచారం అందుకున్న గ్రామస్తులు పెద్దఎత్తున చెరువు వద్దకు చేరుకున్నారు. తల్లి, ఇద్దరు పిల్లలు మృతి చెందడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. మృతదేహాల వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి. మమత స్వగ్రామం నుండి బంధువులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ఆందోళన నిర్వహించారు. పోలీసులు నచ్చజెపి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.