Thursday, January 23, 2025

బిడ్డకు తల్లి పాలు మొదటి టీకాతో సమానం: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

బిడ్డకు తల్లి పాలు మొదటి టీకాతో సమానం..

రోగనిరోధక శక్తి పెంచి బిడ్డను ఆరోగ్యంగా ఉంచుతుంది

పాలు ఇవ్వడం వల్ల బిడ్డకు, తల్లికి ఇద్దరికీ ఉపయోగం

డబ్బా పాలు వద్దు.. తల్లి పాలు ముద్దు మన నినాదం కావాలి

ఆరోగ్య సమాజాన్ని నిర్మించడంలో ఆశాలు, ఏ ఎన్ ఎం లు, అంగన్ వాడీలది కీలక పాత్ర

మొదటి ఏ ఎన్ సి చెకప్ నుండే తల్లులకు అవగాహన పెంచాలి

వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు సి సెక్షన్లు తగ్గేలా కృషి చేయాలి

ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పిలుపు

Harish rao comments on Modi govt

సిద్దిపేట: మన దేశంలో మొదటి గంటలో తల్లి పాలు తాగుతున్న వారి శాతం కేవలం 41 మాత్రమే ఉందని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ విషయంలో బంగ్లాదేశ్ 92 శాతం తో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. గజ్వేల్ లోని మహతి ఆడిటోరియంలో నిర్వహించిన అంతర్ జాతీయ తల్లి పాల వారోత్సవం కార్యక్రమంలో ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఎంపి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఫారుక్ హుస్సేన్, యాదవ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ…

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), యునిసెఫ్ సంయుక్తంగా ఆగస్టు మొదటి వారంలో ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు నిర్వహిస్తాయి. కాబోయే తల్లుల్లో, సమాజంలో.. తల్లి పాల ప్రాముఖ్యతపై అవగాహన కల్గించడమే ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశ్యమన్నారు.  Step Up For Breastfeeding: Educate and Support’ అనే నినాదంతో ఈ వారం పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

ప్రపంచంలో తల్లి పాలకు ప్రత్యామ్నాయం లేదని, అత్యంత విలువైనదని, విశిష్టమైనదని ప్రశంసించారు.  తల్లి పాలు తాగడం వలన బిడ్డతో పాటు తల్లికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని, తల్లి బిడ్డకు ఎంతో మంచి జరుగుతుందని పేర్కొన్నారు. తల్లి పాలు అందని కారణంగా మన దేశంలో నిమోనియా, నీళ్ళ విరేచనాలతో ఏటా లక్ష మంది పిల్లలు చనిపోతున్నారని, ఏటా ఎంతో మంది తల్లులు రొమ్ము కేన్సర్, అండాశయ కేన్సర్, షుగర్ వ్యాధి బారిన పడుతున్నారని,  ఇవి రెండు మనం నియంత్రించదగిన విషయాలని సూచించారు.  బిడ్డకు, తల్లికి జరుగుతున్న ఈ నష్టాన్ని ఆపడం మన చేతుల్లోనే ఉందని, దీనికి ఎలాంటి అదనపు ఖర్చు అవసరం కూడా లేదని, బిడ్డకు తల్లి పాలు పడితే చాలు అని అన్నారు.  మొదటి గంటలో వచ్చే పాలను ముర్రుపాలు అంటారని, ఇవి అమృతంతో సమానమని, బిడ్డకు ముర్రుపాలు పట్టించడం ద్వారా వ్యాధి నిరోధకశక్తి పెరిగి శిశువుకు రోగాలు దరి చేరవన్నారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే రోగ నిరోధక శక్తిని పెంచే మొదటి టీకా అని చెప్పారు.

తల్లి పాలు ఎక్కువ కాలం తాగించడం వల్ల బిడ్డకు రోగనిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్స్ సోకకుండా కాపాడతాయని, భవిష్యత్ లో షుగర్, అధిక బరువు, కేన్సర్, ఆస్తమా వంటి రోగాలు వచ్చే అవకాశం ఉండదనీ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయని, తల్లి పాలు ఎక్కువ కాలం తాగిన పిల్లల్లో తెలివి తేటలు ఎక్కువగా ఉంటాయన్నారు. తల్లులు చనుపాలు ఇవ్వడంతో గర్భధారణ తర్వాత రక్తస్రావ ప్రమాదం తగ్గడంతో పాటు త్వరగా కోలుకుంటారని, జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారని హరీష్ రావు చెప్పారు.

చనుపాలు ఇవ్వడంతో ఊబకాయం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. బిడ్డకు పాలు పట్టించడంతో రొమ్ము, గర్భ సంచి క్యాన్సర్లు రావు. తల్లులకు మలి వయసులో వచ్చే అస్టియో పొరొసిన్‌ (ఎముకల బలహీనత) నుంచి కాపాడుతుంది. తల్లికి మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం ఉంటుందన్నారు.  అయితే తల్లి బిడ్డకు ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఈ విషయంలో నిర్లక్ష్యం చూపుతున్నారని, ముర్రు పాలు అందించక పోవడానికి సిజెరియన్లు కారణం కాగా, వివిధ కారణాలతో ఎక్కువ కాలం పాటు బిడ్డకు చనుబాలు ఇవ్వకుండా నేటి కాలంలో కొందరు నిర్లక్యం చేస్తున్నారన్నారు.  జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2021 ప్రకారం, పుట్టిన మొదటి గంటలో ముర్రు పాలు అందిస్తున్న తల్లుల శాతం మన దేశంలో కేవలం 41.6 శాతం. మిగతా 60 శాతం అందించడం లేదని, రోగనిరోధక శక్తిని పెంచే సహజమైన మొదటి టీకాను పొందలేక పోతున్నారన్నారు.  దీనికి ప్రధాన కారణం సిజెరియన్లు అని, దీంతో ప్రసవం తర్వాత మొదటి గంటలో పాలు పట్టించడం సాధ్యం కావడం లేదన్నారు. రాష్ట్రంలో  సెక్షన్ ఆపరేషన్లు తగ్గించేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నామని, మా వైద్యులు, ఆశా కార్యకర్తల సహకారంతో మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు.

తల్లులు పాలు పట్టలేని నవజాత శిశువులకు, తల్లులు మరణించిన శిశువులకు, అనారోగ్యంతో ఉన్న లేదా తగినంత పాలు అందని శిశువులకు లేదా తల్లి పాలను తీసుకోలేని శిశువులకు పాలు అందించాలని మదర్ మిల్క్ బ్యాంక్ లను… సిఎం కెసిఆర్ ఆదేశాలతో ప్రభుత్వం ప్రారంభించామన్నారు.  హైదరాబాద్‌ నీలోఫర్‌ పిల్లల దవాఖానలో మొట్ట మొదటగా ఏర్పాటు చేశామని, ఇది విజయవంతం కావడంతో వరంగల్‌, ఖమ్మంలోనూ మదర్‌ మిల్క్‌ బ్యాంక్‌ అందుబాటులోకి తెచ్చామన్నారు.

కొందరు డబ్బాపాలు ఇచ్చేందుకు ప్రాధాన్యమిస్తున్నారని, దాని వల్ల బిడ్డకు ప్రయోజనం ఉండదని, తల్లిపాలు ముద్దు, డబ్బపాలు వద్దు అనే ప్రచారాన్ని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. తల్లి పాల వారోత్సవాల సంద్భర్బంగా ప్రజల్లో అవగాహన పెంచేలా కార్యక్రమాలు చేయాలని కోరుతున్నామన్నారు.  500 మంది తల్లులకు ఇక్కడ అవగాహన కల్పించి, బుక్ ఆఫ్ ఇండియాలో చోటు సంపాదించడం గొప్ప విషయమని, తల్లి, బిడ్డ రక్షణకు మా ఆశాలు, ఎఎన్ఎంలు ఎంతో కృషి చేస్తున్నారని ప్రశంసించారు. అందరికీ తల్లి పాల వారోత్సవాల శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News