హైదరాబాద్: తన ఆలేరు నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభించడం సంతోషంగా ఉందని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. వాసాలమర్రి గ్రామ దళితుల పక్షాన సిఎం కెసిఆర్ కు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.దేశంలో అతి పెద్ద నిర్ణయం తీసుకున్న ఏకైక సిఎం అని.. దేశానికే ఆదర్శవంతమైన సిఎం కెసిఆర్ అని మోత్కుపల్లి అన్నారు. అన్ని పార్టీలు దళితులను దళితులుగానే చూశారు తప్ప… నేరుగా దళితుల ఖాతాల్లో పది లక్షల రూపాయలు వేయడం ఎక్కడా చూడలేదన్నారు. రాష్ట్రంలోని దళిత కుటుంబాలన్నింటికి దళిత బంధు ఇస్తారనడానికి వాసాలమర్రె నిదర్శనమన్నారు. ప్రతిపక్ష పార్టీలు వారు అధికారంలో ఉన్న రాష్టాల్లో దళిత బంధు అమలు చేసే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. దళిత బంధు దేశం మొత్తం అమలు చేసే విధంగా జాతీయ పార్టీలు వారి అధిష్ఠానాలను ఒప్పించాలని డిమాండ్ చేశారు. హుజురాబాద్ నియోజకవర్గానికే పరిమితం అని దళిత బంధుఃపై అవాకులు చెవాకులు పేల్చిన వారు ఇప్పుడు సిగ్గుతో తలదించుకోవాలని మోత్కుపల్లి మండిపడ్డారు. దళితులను బాగు చేయాలనే ఉద్దేశ్యం కెసిఆర్ కు తప్ప.. ఏ రాజకీయ పార్టీకి లేదన్నారు. దళితులకు ఆర్థిక పరిపుష్టి కల్పిస్తే రాబోయే రోజుల్లో అంబేద్కర్ వారసుడిగా కెసిఆర్ మిగిలిపోతారని ప్రశంసించారు. అన్ని పార్టీల నాయకులు కెసిఆర్ కు జేజేలు పలుకాల్సిన అవసరం ఉందన్నారు. అంబేద్కర్ లేకపోతే మేము మంత్రులం ,ఎమ్మెల్యేలం కాకపోయేవారిమన్నారు. మరియమ్మ విషయంలో పోలీస్ అధికారులను శాశ్వతంగా సర్వీస్ నుండి తొలగించారని.. నిన్న వరంగల్ లో ఎస్ఐపై ఒక ట్రైనీ మహిళ ఎస్ఐ చేసిన ఆరోపణల విషయంలో కూడా వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నారు అని మోత్కుపల్లి చెప్పారు. దళిత బంధు పథకంతో సిఎం కెసిఆర్ దేశ చరిత్రలో నిలుస్తారన్నారు. నా జాతి కోసం గొప్ప పథకాలు అమలు చేస్తున్న సిఎం కెసిఆర్ కు నా మద్దతు ఉంటుందని మారోసారి చెప్తున్నానని మోత్కుపల్లి చెప్పారు.
Mothkupally Narsimhulu praises on CM KCR