మన తెలంగాణ/మోత్కూరు: పేదలకు ఇళ్ల స్థలాలు, ఇండ్లతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల పోరాట ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం మోత్కూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బొల్లు యాదగిరి మాట్లాడుతూ బిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు గడిచినా డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చకుండా పేదలను మోసగించిందని, యాదాద్రి జిల్లాలో ఏ ఒక్కరికీ ఇండ్లు ఇవ్వలేదన్నారు. ఇళ్ల స్థలాలు, ఇండ్లు మంజూరు చేయలేదని, కేంద్ర ప్రభుత్వం ఆవాస్ యోజన పథకంలో ఇస్తామన్న ఇళ్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు.
Also Read: వచ్చిందే టైం.. చేసిందే డ్యూటీ..!
డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామన్న ప్రభుత్వం ఆ మాటను మార్చి రూ.5 లక్షలు ఇస్తామని చెప్పారని, ఇప్పుడు గృహలక్ష్మీ ద్వారా రూ.3 లక్షలు ఇస్తామంటున్నారని, పెరిగిన ధరలతో ఆ డబ్బులతో పేదలు ఏ విధంగా ఇళ్లు కట్టుకుంటారని బొల్లు ప్రశ్నించారు. ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తే అయ్యే రూ.10 లక్షలు పేదలకు ఇవ్వాలని, ఇంటి స్థలాలు లేనివారికి ఇంటి స్థలాలు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పేదలకు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని, లేనిపక్షంలో రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని బొల్లు హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ షేక్ అహ్మద్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు రాచకొండ రాములమ్మ, మండల నాయకులు దడిపెల్లి ప్రభాకర్, మెతుకు అంజయ్య, పిట్టల చంద్రయ్య, కొంపెల్లి గంగయ్య, గుండు లక్ష్మీ, కందుకూరి అంజమ్మ, మాండ్ర చంద్రయ్య, ఎండి.ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.