Monday, December 23, 2024

ప్రత్యక్ష సాక్షి లేకపోతే… నేరానికి గల కారణమే కీలకం : సుప్రీం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఒక నేరం జరిగితే దాన్ని నిరూపించడానికి ప్రత్యక్ష సాక్షులు లేని సమయంలో కనీసం ఆ ఘటనకు ప్రేరేపించిన కారణాన్ని అయినా రుజువు చేయాలని సుప్రీం కోర్టు పేర్కొంది. 2008 నాటి హత్య కేసులో దోషిగా తేలిన ఓ వ్యక్తి తన శిక్షను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ వ్యక్తి తన మేనల్లుడిని హత్య చేశారంటూ 2008లో పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు.

విధుల నుంచి ఇంటికి తిరిగి వస్తున్న తన మేనల్లుడిని అతడి స్నేహితుడు దాడి చేసి చంపేశాడని , తాను ఘటనాస్థలానికి వెళ్లేసరికి నిందితుడు పారి పోయాడని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఘటనాస్థలంలో ఆయుధం దొరికింది. కేసు నమోదు చేసిన పోలీస్‌లు మృతుడి స్నేహితుడిని అరెస్టు చేశారు. ఆ తరువాత విచారణ చేపట్టిన ఛత్తీస్‌గఢ్ హైకోర్టు అతడిని దోషిగా తేల్చి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ నిందితుడు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై ద్విసభ్య ధర్మాసనం శనివారం విచారణ జరిపింది.

“ ఈ కేసులో మృతుడి మామ చెప్పిన వాంగ్మూలాన్ని నమ్మలేం. నేరారోపణకు ఇది సరైన ఆధారం కాదు. ఈ కేసులో నేరాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేరు. సాధారణంగా ప్రత్యక్షసాక్షులు ఉన్నప్పుడు నేరానికి గల కారణాన్ని నిరూపించాల్సిన అవసరం లేదు. కానీ ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులు లేనందున ఘటనకు ప్రేరేపించిన కారణం కీలకంగా మారుతుంది. దాన్ని ప్రాసిక్యూషన్ నిరూపించాలి. ఇక మృతుడికి, నిందితుడికి మధ్య ఎలాంటి శత్రుత్వం లేదని సాక్షులు చెప్పారు” అని ధర్మాసనం తెలిపింది.

ఘటన ప్రదేశంలో దొరికిన ఆయుధం కారణంగా అతడు చనిపోలేదని పోస్ట్‌మార్టమ్ నివేదికలో తేలినట్టు ధర్మాసనం గుర్తించింది. “ నిందితుడు ఏ కారణం లేకుండా తన స్నేహితుడిని ఎందుకు చంపుతాడన్నది ప్రాసిక్యూషన్ రుజువు చేయలేదు” అని కోర్టు వ్యాఖ్యానించింది. అందువల్ల సరైన సాక్షాధారాలు లేని కారణంగా ఈ కేసులో నిందితుడిని నిర్దోషిగా ప్రకటిస్తున్నట్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News