హైదరాబాద్: మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులుకు హృదయపూర్వక స్వాగతమని సిఎం కెసిఆర్ తెలిపారు. కెసిఆర్ సమక్షంలో మోత్కుపల్లి టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. గులాబీ కండువా కప్పి మోత్కుపల్లిని కెసిఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. మోత్కుపల్లి తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకున్నారని, అట్టడుగు వర్గాల గొంతు అని, తనకు అత్యంత సన్నిహితుడు అని చెప్పారు. ఒకనాడు కరెంట్ కోసం ఎన్ని అవస్థలు పడ్డామో మోత్కుపల్లికి తెలుసునని, దశాబ్ధాలుగా ఎంతోమందికి అర్థం కాని బాధలను అనుభవించామన్నారు. ఒక దశలో తెలంగాణ సమాజం చెదిరిపోయిందని, తెలంగాణ పరిష్కారం కోసం ఎవరూ ధైర్యం చేయలేదని, తెలంగాణ కోసం బయల్దేరితే తనని చంపుతామని బెదిరించారన్నారు.
మంచి నీళ్లు కూడా కొనుక్కుని తాగే పరిస్థితి గతంలో ఉండేదన్నారు. గూడు చెదిరిన బిడ్డల్లా ఆగమాగంగా బతికామని కెసిఆర్ గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడితే తప్ప బాగుపడమనే భావన అందరిలో వచ్చిందని, తెలంగాణ ఏర్పడుతుంది చూడండి అని చెప్పానని, తనని తిట్టినన్ని తిట్లు దేశంలో ఎవరినీ తిట్టలేదన్నారు. తెలంగాణ సాధనలో భాగంగా బిఎస్‌పి నేత మాయవతి ఇంటికి 19 సార్లు వెళ్లానని, ఎక్కే గడపా… దిగే గడపాతో అనేక పార్టీల మద్దతు కూడగట్టామని కెసిఆర్ గుర్తుచేశారు. చివరికి ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ సాధించుకున్నామన్నారు. తెలంగాణ ఏర్పడిన నాడు అనేక బాధలు ఉన్నాయని, మేధావులతో చర్చలు జరిపి ఒక కొలిక్కి తెచ్చానని గుర్తు చేశారు. ఒకనాడు వల్లకాడులా ఉన్న ఊళ్లు మళ్లీ వెలుగుతున్నాయని, గ్రామాలు ఎటు చూసినా పచ్చగా కనిపిస్తున్నాయని, కథ ఇంకా అయిపోలేదని, చాలా ఉందన్నారు. చాలా మందికి న్యాయం జరగాల్సిన అవసరం ఉందని, కరెంటు బాగు చేసుకున్నామని, వ్యవసాయం గాడిన పడిందన్నారు.