Friday, November 22, 2024

దళితబంధు ఆగదుకాక ఆగదు

- Advertisement -
- Advertisement -
Motkupalli Narasimhulu join trs party
దళిత సమాజ ఉద్ధరణ కోసమే ఈ పథకం
భారత దళిత సమాజానికి తెలంగాణ దళిత సమాజం దిక్సూచి కావాలి
దళితబంధును దశలవారీగా అన్ని వర్గాలకు
అమలుచేస్తాం వచ్చే ఏడేళ్లలో రాష్ట్రంలో 23
లక్షల కోట్ల బడ్జెట్ ఉంటుంది దళిత బంధుకు
రూ.1 లక్షా 70వేల కోట్లు వెచ్చించడం పెద్ద
సమస్య కాదు రాజకీయాలు అంటే ప్రతిపక్షాలకు
ఒక క్రీడ, టిఆర్‌ఎస్‌కు ఓ యజ్ఞం నీతివంతమైన
రాజకీయాలు చేస్తాం సేవలను
సంపూర్ణంగా వినియోగించుకుంటాం : కెసిఆర్
తెలంగాణ భవన్‌లో పార్టీలో చేరిన మోత్కుపల్లికి
ఆహ్వానం పలికిన సిఎం కెసిఆర్

 

మన తెలంగాణ/హైదరాబాద్: తన ప్రాణం పోయినా….దళిత బంధు పథకం ఆగదని టిఆర్‌ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. కేవలం ఓట్ల కోసం తెచ్చిన పథకం కాదని…దళిత సమాజం ఉద్దరణ కోసమే దళితబంధును తీసుకొచ్చామన్నారు. దశల వారిగా గిరిజనులు, బిసిలు, ఈబిసిలకు కూడా అమలు చేస్తామని స్పష్టం చేశారు. పథకం తీసుకరావడానికి బలమైన కారణం ఉందన్నారు. దళిత బంధుతో ప్రారంభమైన ఈ యజ్ఞం ఎన్ని అవాంతరాలు వచ్చినా…. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నిరాటంకంగా కొనసాగుతుందన్నారు. వచ్చే ఏడేళ్లలో రాష్ట్రంలో రూ. 23 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో రానున్న ఏడేళ్లలో దళిత బంధుకు 1లక్ష 70 వేల కోట్లు వెచ్చించడం పెద్ద సమస్య కాదన్నారు. దళిత బంధును ఆరు నూరైనా ముందుకు తీసుకుపోతామన్నారు. రాజకీయాలు అంటే ప్రతిపక్షాలకు ఒక క్రీడ… కానీ టిఆర్‌ఎస్‌కు మాత్రం ఒక యజ్ఞం..వంటిదని వ్యాఖ్యానించారు. నీతివంతమైన రాజకీయాలు చేయడంలో ఎప్పుడు టిఆర్‌ఎస్ ముందుంటుందన్నారు. మం త్రి మోత్కుపల్లి నర్సింహులు సోమవారం తెలంగాణ భవన్‌లో సిఎం కెసిఆర్ సమక్షంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. గులాబీకండువా కప్పి మోత్కుపల్లిని పార్టీలోకి ఆయన సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ, మోత్కుపల్లిపై పెద్దఎత్తున ప్రశంసల జల్లును కురిపించారు. మోత్కుపల్లికి ఎంతో రాజకీయ అనుభవం ఉందన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ప్రధానంగా అట్టడుగు వర్గాలకు సేవ చేయాలని తపించే వ్యక్తి అని అన్నారు. అలాగే ఎవరికి పరిచయం అక్కరలేని వ్యక్తి అని వ్యాఖ్యానించారు. తనకు అత్యంత సన్నిహితుడని సిఎం వెల్లడించారు

ఆయనతో స్నేహం రాజకీయాలకు అతీతం

మోత్కుపల్లితో స్నేహం రాజకీయాలకు అతీతమని సిఎం కెసిఆర్ అన్నారు. ప్రజా జీవితంలో మోత్కుపల్లికి ఒక స్థానం ఉందని, విద్యార్థి దశ తర్వాత క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారని కెసిఆర్ పేర్కొన్నారు. ఒక శాసనసభ్యుడిగా, మంత్రిగా సేవలందించడమే కాకుండా అణగారిన ప్రజల గొంతుగా నిలిచి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారన్నారు. అలాంటి మోత్కుపల్లికి కరోనా వచ్చినప్పుడు వైద్యులతో మాట్లాడానని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. ఆయన వైద్యానికి రూ.కోటి ఖర్చయినా పర్లేదని చెప్పానని అన్నారు. అలాగే ఇద్దరం కలిసి అనేక ఏళ్లు రాజకీయాల్లో కలిసి పనిచేశామని ఈ సందర్భంగాగుర్తు చేసుకున్నారు.

ఎన్నో ఇబ్బందులు పడ్డాం

అప్పట్లో విద్యుత్ కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డామని సిఎం కెసిఆర్ తెలిపారు. ఆ రోజుల్లో కరెంటు కోతల కష్టం ఎలా ఉండేదో మా ఇద్దరికి తెలుసు అని అన్నారు. తెలంగాణ వస్తే పెట్టుబడులు రావన్న తప్పుడు ప్రచారం చేశారన్నారు. తెలంగాణ సాధనలో మాయావతి ఇంటికి 19 సార్లు వెళ్లానని సిఎం కెసిఆర్ అన్నారు. చివరకు మంచినీళ్లు కూడా కొనుక్కుని తాగాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. మన సమస్య ఏమిటో అందరికీ వివరించి చివరకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని కెసిఆర్ చెప్పారు. తెలంగాణ వస్తుందని ఆ రోజులోనే ఎంతో ధీమాగా చెప్పానని, దీని కోసం 38 పార్టీల మద్దతు కూడగట్టి రాష్ట్రాన్ని సాధించామన్నారు. అన్యాయానికి గురైన వారిని బాగు చేయాలనే ఉద్దేశంతో ఎన్నో చర్యలు చేపట్టామని, చేనేతల ఆత్మహత్యలు ఆగే విధంగా చర్యలు చేప ట్టా మన్నారు.

స్వరాష్ట్రమే సమస్యలకు పరిష్కారమని ఉద్యమం ప్రారంభించామని.. ఆ ఉద్యమంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని కెసిఆర్ వెల్లడించారు. ఆ సమయంలో తనను తిట్టినన్ని తిట్లు దేశంలో ఎవరినీ తిట్టలేదని ఆయ న ఆవేదన వ్యక్తం చేశారు. అయినా తెలంగాణ రాష్ట్రం సాధించాలన్న ఏకైక లక్షంతో ముందుకు సాగానని అన్నారు. దీని కోసం ఎన్నో ఇబ్బందులు కూడా పడ్డానని అన్నారు. అయినా తెలంగాణ సాధన కోసం అనాడు వెనకడుగు వేయలేదన్నారు. తెలంగాణ వస్తే నక్సలైట్లు ఎకె 47లు పట్టుకుని తిరుగుతారని అపోహలు సృష్టించారన్నారు. రాష్ట్రానికి ఎలాంటి పెట్టుబడులు రావన్నారన్నా రు. తెలంగాణ ఉద్యమాన్ని మొదలు పెట్టినప్పుడు కొంద రు మిత్రులు తనను చంపేస్తారని కూడా హెచ్చరించారన్నారు. అయినా ఏనాడు భయపడలేదని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. అన్ని సమస్యలను ఒక సవాల్‌గా తీసుకుని పనిచేశామన్నారు. ఇప్పుడిప్పుడే వాటి ఫలితాలు వస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగానే ప్రస్తుతం గ్రామాలు సర్వాంగ సుందరంగా మారాయన్నారు. ఊర్లకు పోతే ఇప్పడు ఉండాలని అనిపిస్తుందన్నారు. హైదరాబాద్ నుంచి వేల సంఖ్యలో పండుగకు ఊర్లకు పోయి మళ్ళీ వస్తుంటే నగరంలో రహదారులన్నీ ట్రాఫిక్ జామ్ అయితోందన్నారు.

బలమైన నాయకత్వం ఉంటేనే…

బలమైన నాయకత్వం ఉంటేనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని సిఎం కెసిఆర్ అన్నారు. రాజకీయాల్లో ఎన్నేళ్లు ఉన్నామనేది ముఖ్యం కాదని.. ఏం సాధించామన్నదే ముఖ్యమన్నారు. వెనకబడిన వర్గాలను బాగుచేసుకునేందుకు యావత్ తెలంగాణ ఏకం కావాలని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ ను బాగు చేసుకోవాలన్నా….చెడు చేసుకోవాలన్న మనమే అని అన్నారు. అంతే తప్ప అమెరికా వాడు వచ్చి చేయడన్నారు. రాజకీయంలో ఒకసారి గెలుస్తాం …ఒక సారి ఓడతాం… అది పెద్ద లెక్క కాదన్నారు. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే సమస్యలు ఒక కొలిక్కి వస్తున్నాయన్నారు. రాష్ట్రం లో రైతులు, చేనేతల ఆత్మహత్యలు పూర్తిగా ఆగిపోయాయని సిఎం పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజల కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

దళిత సమాజం దిక్సూచి కావాలి

భారత దళిత సమాజానికి తెలంగాణ దళిత సమాజం దిక్సూచి కావాలని ముఖ్యమంత్రి కోరుకున్నారు. అంబేడ్కర్ పుణ్యమా అని ఎస్‌సిలకు రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయన్నారు. అంబేడ్కర్ చూపిన బాటలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గత ప్రభుత్వాలు పోడు సమస్యను పరిష్కరించలేదని.. దాని పరిష్కారం కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నామన్నారు. మంగళవారం యాదాద్రికి వెళ్లనున్నామని.. ఈ పర్యటనకు మోత్కుపల్లిని కూడా ఆహ్వానించామన్నారు. దళితబంధు అమలు కోసం రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి కమిటీలుంటాయని.. పథకం అమలులో ఎవరికి అధికారం ఉండదన్నారు. కేవలం కమిటీలు మాత్రమే దళితబంధును అమలు చేస్తాయని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు.

దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నాం

తెలంగాణ సమాజం అత్యంత దారుణమైన పరిస్థితులను అనుభవించిందని, ఎన్నో సమస్యల కారణంగా చాలా బాధలు పడ్డామని సిఎం కెసిఆర్ అన్నారు. చాలా ఇబ్బందులను అనుభవించామన్నారు. ఒకప్పుడు మోత్కుపల్లి కరెంట్ మంత్రిగా ఉండే. తాను ఆయనను కలిసినప్పుడు కరెంట్ బాధలు ఉన్నాయని చెప్పారు. ఆలేరు అంతా కరువు ప్రాంతం. ఎన్ని ట్రాన్‌ఫార్మర్లు తీసుకొచ్చినా లాభం లేకుండా పోయింది అని ఆవేదన వ్యక్తం చేశారన్నారు. విద్యుత్ కోసం తెలంగాణ ప్రాంతం ఎన్నో కష్టాలు పడిందని ఈ సందర్భంగా కెసిఆర్ గుర్తు చేశారు. కొందరు తమ ప్రభుత్వం ఏం చేయడం లేదని ఏడుపులు మొదలుపెట్టారని ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మీద పడి ఏడ్చేవాళ్లు… వాళ్లు అధికారంలో కొనసాగిన గత 60 ఏళ్లలో ఇలాంటి పనులు ఎందుకు చేయలేదని కెసిఆర్ ప్రశ్నించారు.

రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్నా ఏమీ చేయలేదన్నారు. వారు చేయలేని పనులను తాము చేసిన చూపిస్తుంటే…దానిపై కూడా చీదరింపులేనా? అని సిఎం కెసిఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏడ్చేవాళ్ల గురించి పట్టింటుకుంటే…మనం ఏం చేయలేమన్నారు. మనకు దమ్ము ఉంది… ధైర్యం ఉందన్నారు. అంతకంటే ఎక్కువగా నిజాయితీ ఉందన్నారు. ఇవి ఉంటే ఏదైనా సాధ్యమేనని సిఎం కెసిఆర్ అన్నారు. అందరికి మంచి జరగాలంటే మంచి నాయకత్వంతోనే సాధ్యమవుతుందని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. వచ్చేసారి కూడా గెలిచేది మనమే అంటూ కెసిఆర్ ధీమా వ్యక్తం చేశారు. కరోనా కారణంగా ఏడాది పాటు దళిత బంధు కార్యక్రమం ఆలస్యమైందన్నారు. ఈ సమావేశంలో మంత్రులు మహమూద్ అలీ, జగదీష్ రెడి, శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత. ఎంపి లింగయ్య యాదవ్, శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు పలువురు శాసనసభ్యులు హాజరయ్యారు.

గట్టిగా దవడకు ఇయ్యాలి

రాష్ట్రంలో పేదవర్గాల ఇళ్లలోని కష్టాలను దృష్టిలో పెట్టుకుని కల్యాణ లక్ష్మీ స్కీమ్ తీసుకువచ్చామని సిఎం కెసిఆర్ పేర్కొన్నా రు. కళ్యాణ లక్ష్మీ కింద లక్ష రూపాయలు ఇస్తున్నామన్నారు. అయినప్పటికీ మీరేమి ఇస్తున్నారని అని ఆడిగేవాళ్ళు తయారు అయ్యారన్నా రు. ఏమి ఇస్తావ్ అని అడిగితే గట్టిగా దవడకు ఇయ్యాలి అని సిఎం కెసిఆర్ అన్నారు. ఈ విషయంలో పార్టీ శ్రేణలు ఎక్కడికక్క డ కథానాయకులు అయి వీటిని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. మోత్కుపల్లిని ఏ స్థాయి లో….ఏ విధంగా వాడుకోవాలో అట్లా వాడుకుంటా అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News