8 నెలల్లో రూ.55 కోట్ల ఆదాయం
ఈ ఏడాది చివరినాటికి రూ.100 కోట్లు వచ్చే అవకాశం
ఫ్యాన్సీ నంబర్లపై వాహనదారుల ఆసక్తి
ధర ఎంతయినా ఆ నెంబర్‌ను దక్కించుకోవడానికి ఉత్సాహం
మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్‌లోని వాహన యజమానులు ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్లపై క్రేజీ పెంచుకుంటున్నారు. యజమానులు ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్లపై క్రేజీ పెంచుకోవడంతో రవాణా శాఖకు అధిక ఆదాయం సమకూరుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోని ఆర్టీఏ కార్యాలయాలకు ఈ ఏడాది ఆగష్టు వరకు వివిధ ఫ్యాన్సీ నంబర్ల వేలం ద్వారా రూ.55 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది.
రానున్న రోజుల్లో ఈ ఆదాయం రూ.100 కోట్లకు చేరే అవకాశం ఉందని ఆర్టీఏ అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం వాహనం కొనుగోలు కంటే ఫ్యాన్సీ నంబర్లను పొందడానికి కొందరు వాహనాలను అధికంగా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. గత ఏడాది రవాణా శాఖకు ఈ ఫ్యాన్సీ నెంబర్‌ల ద్వారా రూ.72 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది చివరి నాటికి రిజిస్ట్రేషన్ల ద్వారా దాదాపు రూ.100 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
9999 నంబర్‌కు ఏకంగా రూ.21.6 లక్షల ధర
9999, 0001, 0007, 0009తో సహా ఫ్యాన్సీ నంబర్లను వాహన యజమానులు ఎక్కువగా ఇష్టపడతారు. ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ సెంట్రల్ జోన్ కార్యాలయంలో ఈ ఏడాది ఇప్పటివరకు నిర్వహించిన వేలంలో 9999 నంబర్‌ను ఏకంగా రూ.21.6 లక్షలకు కొనుగోలు చేశారు. ఇదే నెంబర్ కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయంలో వాహనదారుడు సుమారు రూ.12.1 లక్షలకు, మలక్ పేట ఆర్టీఏలో వాహనదారుడు రూ.9.9 లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఖైరతాబాద్‌లో అత్యధికంగా 9999 నెంబర్‌కు రూ.10.5 లక్షలు ధర నమోదు కావడం విశేషం.
చాలా మంది వాహనదారులు 9 నెంబర్‌ను అదృష్ట సంఖ్యగా పరిగణించి, దానిని సొంతం చేసుకోవడానికి అధికమొత్తాన్ని వెచ్చించడం గమనార్హం. కొందరు వాహనదారులు కూడా 9లోపు ఉన్న నంబర్లపైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని 02, 1,2,2,3 వంటి రిజిస్ట్రేషన్ నంబర్లకు కూడా భారీ సంఖ్యలో బిడ్డింగ్‌లు వస్తున్నాయని, దీంతోపాటు వాహనదారులు తమ పిల్లల పుట్టినరోజు లేదా ఏదైనా ప్రత్యేక రోజులను పరిగణనలోకి తీసుకొని ఈ ఫ్యాన్సీ నెంబర్‌లపై మోజు పెంచుకుంటున్నారని రవాణా శాఖ అధికారులు తెలిపారు.