Tuesday, September 17, 2024

నంబర్ ప్లేట్ లేకుంటే దొంగలే

- Advertisement -
- Advertisement -

Motorists Tampered number plates to escape challans

హైదరాబాద్: ట్రాఫిక్ చలాన్లు తప్పించుకోవడానికి వాహనదారులు నంబర్ ప్లేట్లను ట్యాంపరింగ్ చేయడం దొంగలకు కలిసి వస్తోంది. నంబర్ ప్లేట్‌ను ట్యాంపర్ చేసి వాటిపై వచ్చి చోరీలు చేస్తున్నారు. నగరంలో ఇలాంటి సంఘటనలు వరుసగా జరుగుతున్నాయి. చైన్‌స్నాచింగ్, మొబైల్ ఫోన్లను చోరీ చేయడం ప్రారంభిస్తున్నారు. పోలీసులు సిసిటివిల్లో చూసినా తెలియకుండా దొంగలు ప్లాన్ వేస్తున్నారు. ముఖాలకు మాస్కులు ధరించడంతో దొంగలను గుర్తించి పట్టుకోవడం కష్టంగా మారింది. అబిడ్స్‌లో యువతి కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడుకుంటూ వెళ్తుండగా నంబర్ ప్లేట్ ట్యాంపర్ చేసిన బైక్‌పై ఇద్దరు దొంగలు వచ్చి మొబైల్ ఫోన్ చోరీ చేశారు. వెంటనే తేరుకున్న యువతి అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సిసిటివిల ఫుటేజ్ పరిశీలించగా బైక్ నంబర్ ప్లేట్ సరిగా లేదు. అంతేకాకుండా వారి ముఖాలు కన్పించకుండా ఉండేందుకు ముఖానికి మాస్కు పెట్టుకున్నారు.

దీంతో దొంగలను గుర్తించడం కష్టంగా మారింది. ఈ సంఘటన జరిగిన వెంటనే నగర పోలీస్ కమిషనర్ వాహనాల తనిఖీకి ఆదేశించారు. పోలీసుల తనిఖీల్లో దాదాపుగా 415 వాహనాలపై కేసులు నమోదు చేశారు. వాటిని స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసి జరిమానా విధించారు. నంబర్ ప్లేట్‌ను ట్యాంపర్ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. గత ఏడాది జులైలో నగర ట్రాఫిక్ పోలీసులు రెండు రోజులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో 940 కేసులు నమోదు చేశారు. వీటిని ఆయుధంగా చేసుకుని దొంగలు రెచ్చిపోతున్నారు. నంబర్ ప్లేట్ సరిగా లేకపోవడంతో వారిని గుర్తించడం కష్టంగా మారింది. కేసు విచారణలో పోలీసులు ఎక్కువగా ముందు సిసి కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తారు. దీని నుంచి తప్పించుకునేందుకు దొంగలను నంబర్ ప్లేట్లను ట్యాంపర్ చేస్తున్నారు.

చలాన్లు తప్పించుకునేందుకే….

వాహనదారులు ఎక్కువగా ట్రాఫిక్ చలాన్లు తప్పించుకునేందుకు వాహనాల నంబర్ ప్లేట్లను ట్యాంపర్ చేస్తున్నారు. హెల్మెట్ లేకున్నా, రాంగ్‌రూట్ తదితర ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినప్పడు ట్రాఫిక్ పోలీసులు నాన్ కాంటాక్ట్ పద్ధతి ద్వారా వాహనాలకు జరిమానా విధించి వారి మొబైల్ ఫోన్లకు పంపిస్తున్నారు. వాహనం నంబర్ ప్లేట్‌ను ట్యాంపర్ చేయడంతో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా కూడా జరిమానా విధించడం సాధ్యం కాదు. అందుకే ఎక్కువ మంది వాహనదారులు నంబర్‌ప్లేట్లను ట్యాంపర్ చేస్తున్నారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. నంబర్ ప్లేట్ ట్యాంపర్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News