Thursday, January 23, 2025

జాతీయ స్థాయి రైఫల్ షూటింగ్‌కు గురుకుల విద్యార్థిని మౌనిక

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ బిసి గురుకుల విద్యార్థిని మౌనిక రైఫిల్ షూటింగ్‌లో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. ్త అవకాశాలు అందిస్తే ఆడపిల్లలేమి తీసిపోరని నిరూపించింది ఆమె. చదువుతో పాటు అనేక రంగాల్లో రాణిస్తూ దేశ ప్రగతిని నలుదిశలా చాటేందుకు తాము తక్కువ కాదని చాటి చెప్పింది. బిసి గురుకుల విద్యార్థిని మౌనిక రైఫిల్ షూటింగ్‌లో విశేష ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించింది. గత ఆరు నెలలుగా శిక్షణ పొందుతున్న మౌనిక వచ్చే ఏడాది జాతీయ స్థాయిలో జరిగే రైఫిల్ షూటింగ్ పోటీల్లో పాల్గొనబోతోంది. ఈ సందర్భంగా మౌనికను మంత్రి గంగుల కమలాకర్, ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి డాక్టర్ మల్లయ్య బట్టు అభినందించారు.

కీసరలోని జ్యోతిబా పూలే బిసి గురుకుల బాలికల పాఠశాలలో కోచ్ సహాయంతో మౌనిక రైఫిల్ షూటింగ్ శిక్షణ పొందారు. ఇక్కడ దాదాపు 25 మంది బాలికలు శిక్షణ తీసుకుంటున్నారు. చార్మినార్ బాలికల గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న మౌనిక విశేష ప్రతిభను కనబరుచడంతో ఆమెను గచ్చిబౌలిలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించారు. అక్కడ మంచి ర్యాంక్ సాధించిన మౌనిక సౌత్ జోన్ స్థాయి పోటీలకు ఎంపిక కావడంతో గత నెల కెరళలో జరిగిన పోటీలకు పంపించారు. అక్కడ మౌనిక తన ప్రతిభను కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యింది.
ఐపిఎస్ అవుతా : మౌనిక
అమ్మా నాన్న పెద్దగా చదువుకోకపోయినా నన్ను, తమ్ముడిని బాగా చదివించాలని కష్టపడుతున్నారు. ఐదోతరగతిలో చార్మినార్ గురుకుల పాఠశాలలో చేరాను. ఆరో తరగతి లో ఉన్నప్పుడు మా స్కూల్‌లో రైఫిల్ షూటింగ్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. అప్పడే రైఫిల్‌ను చూడటం. గురిచూసి లక్షాన్ని ఛేదించడం బాగా నచ్చింది. కరోనా కారణంగా స్కూల్‌కు సెలవులు ఇవ్వడంతో శిక్షణ ఆగిపోయింది. ఈ ఏడాది స్కూల్ ప్రారంభం కాగానే రైఫిల్ షూటింగ్ శిక్షణ కూడా మొదలు పెట్టారు. కోచ్ సర్, ప్రిన్సిపల్ సర్, సెక్రటరి సార్, నన్ను ఎంతో ప్రోత్సహించారు.

వారి ప్రోత్సాహంతో రాష్ట్రస్థాయి, సౌత్ జోన్ స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. ఇప్పుడు జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించాను. వచ్చే ఏడాది జరిగే పోటీల్లో పాల్గొని మెడల్స్ పాధిస్తాను. నన్ను ప్రోత్సహించిన అందరికీ ధన్యవాదాలు, పేదవారికి ఉచిత విద్యను అందిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ సార్, మంత్రి గంగుల కమలాకర్ సార్‌కు ధన్యవాదాలు, ఉన్నత చదువులు చదివి ఐపిఎస్ కావాలన్నదే నా లక్షం.
పట్టుదల చూసి : రాములు గౌడ్ ప్రిన్సిపల్
రైఫిల్ షూటింగ్ అనగానే చాలా మంది అమ్మాయిలు భయపడ్డారు. కొందరు అమ్మాయిలు చాలా ధైర్యంగా ముందుకు వచ్చి కోచింగ్ తీసుకుంటున్నారు. వారిలో మౌనిక చాలా పట్టుదలతో నేర్చుకుంది. కరోనా తర్వాత స్కూల్ ప్రారంభం కాగానే కోచింగ్‌లో చేరింది. అమ్మాయి ప్రతిభను, పట్టుదలను గుర్తించి కోచ్ రాష్ట్ర స్థాయిలో పాల్గొనేలా కోచింగ్ ఇచ్చారు. మంత్రి గంగుల కమలాకర్, ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ప్రోత్సాహం , మల్లయ్యబట్టు సంకల్పంతో ఇది సాధ్యమయ్యింది. మౌనికతో పాటు మరెందరో అమ్మాయిలు రైఫిల్ షూటింగ్‌లో రాణిస్తారని ఆశిస్తున్నాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News