లండన్ : భూమి లోపల అట్టడుగున హిమాలయ పర్వతాల కన్నా మూడు నాలుగింతలు ఎత్తుగా ఉండే పర్వతాలు ఉన్నాయని నిర్థారించారు. సాధారణంగా భూమిపైనే కొండలు గుట్టలు పర్వతాలు విస్తరించుకుని ఉంటాయి. అయితే ఇందుకు భిన్నమైన ఆవిష్కరణ అరిజోనా స్టేట్ యూనివర్శిటీ నిపుణుల అధ్యయనంలో జరిగింది, బిబిసి ఈ విషయాన్ని ప్రసారం చేసింది. వర్శిటీకి చెందిన శాస్త్రజ్ఞులు జరిపిన అధ్యయనంలో భూమి అట్టడుగున 24 మైళ్లు ( 38 కిలోమీటర్లు) మించిన ఎత్తులో ఈ పర్వతాలు నెలకొని ఉన్నాయని నిర్థారణ అయింది.
హిమాలయాల్లోని మౌంట్ ఎవరెస్టు కేవలం 5.5 మైళ్ల ఎత్తున ఉంది. దీనితో పోలిస్తే ఈ పాతాళపు పర్వతాలు నాలుగయిదు రెట్లు ఎక్కువ ఎత్తులో విస్తరించుకుని ఉన్నట్లు వెల్లడైంది. అంటార్కిటికా నుంచి వెలువడ్డ వేయికి పైగా భౌగోళిక సంకేతాలను పూర్తి స్థాయిలో సైంటిస్టులు విశ్లేషించుకుని , భూమిలోపలి పొరల్లో పర్వతాలతో కూడిన హెచ్చుతగ్గుల శిలాతరహా పదార్థాలు పర్చుకుని ఉన్నట్లు, వీటిని పర్వతాలుగా నిర్థారించినట్లు అరిజోనా వర్శిటీ జియోఫిజిస్టు ఎడ్వర్డ్ గార్నెరో తెలిపారు.