మన తెలంగాణ / హైదరాబాద్ : బిసి డిమాండ్ల సాధన కోసం ఉద్యమ కార్యాచరణ చేపట్టేందుకు ఈ నెల 15న తెలంగాణ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ తెలిపారు. బిసిలకు ముఖ్యమంత్రి పదవితో పాటు తక్షణ బిసి జనగణన, మహిళా రిజర్వేషన్‌లో బిసిల వాటా, చట్టసభలలో 63 శాతం బిసి రిజర్వేషన్‌ల సాధన, అదే నిష్పత్తిలో టికెట్లు కేటాయింపు తదితర డిమాండ్ల సాధన కోసం ఈ సమావేశంలో ఉద్యమ కార్యాచరణ ఖరారు చేయనున్నట్లు తెలిపారు. కాచిగూడ మున్నూరు కాపు భవన్ లో ఈ సమావేశం జరుగుతుందన్నారు. శుక్రవారం విద్యానగర్ బిసి భవన్ లో జరిగిన కోర్ కమిటీ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ఈ రిజర్వేషన్లు అసమతౌల్యత విధానాల కారణంగానే అగ్రకులాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ద్వారా 89 మార్కులకే కానిస్టేబుల్ ఉద్యోగం వస్తే బిసిల కట్ ఆఫ్ మార్క్ 104 మార్కుల కొచ్చే దుస్థితి వచ్చిందని ఆయన తెలిపారు.
బిసిలు 70 శాతం పైగా ఉన్న పాలమూరు, ఇందూరు జిల్లాలకు వచ్చిన ప్రధాన మోడి బిసి రిజర్వేషన్‌ల అంశం, మహిళా రిజర్వేషన్‌లు, బిసి సబ్ కోట అంశంపై ఒక మాట కూడా మాట్లాడకపోవడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాధికారం ఆశిస్తున్న కాంగ్రెస్, బిజెపిలు తక్షణమే బిసి ముఖ్యమంత్రి ప్రకటిస్తేనే బిసిలను ఆకర్షించగలరని ఆయన తెలిపారు. ప్రతి పదేళ్లకు ఒకసారి 1881 నుండి విధిగా జరుగుతున్న జనగణనకు 16వసారి ఆటంకం ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు. బిసిల జనగణన డిమాండు తారాస్థాయికి వచ్చినందునే జనగణను పెండింగ్‌లో పెట్టి బిసిలకు, మహిళలకు అన్యాయం చేస్తూ 2శాతం ఉన్న అగ్రకులాలకు 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ప్రశ్నార్థకం కావద్దనే దూరాలోచనతోనే ఈ పని చేశారని ఆయన ఆరోపించారు.
బిసి ప్రధానిగా ముఖం చూపిస్తూ అగ్రకులాల ఏజెండాను కొనసాగిస్తున్నారని ఆయన తెలిపారు. ఇటువంటి బిసి వ్యతిరేక ఆలోచనలతోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా 2015 జనగణన సర్వేను ప్రకటించలేదని ఆరోపించారు. ఇలాంటి అన్యాయాలను ఎండగట్టడానికి గ్రామస్థాయి వరకు ఉద్యమ నిర్మాణాన్ని చేపట్టడానికి, భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణకై ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 15న జరిగే సమావేశంలో అన్నిమండలాలు, 33 జిల్లా కార్యవర్గాలు, బిసి కుల సంఘాలు, అనుబంధ సంఘాలన్నింటితో సమాలోచన చేసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఎర్రసత్యనారాయణ తెలిపారు.
ఈ సమావేశంలో జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం, రాష్ట్ర కన్వీనర్ లాల్ కృష్ణ, పి. సుధాకర్, ఎన్. శ్రీనివాస్ యాదవ్, నందగోపాల్, కృష్ణుడు, వేముల రామకృష్ణ, బాల్ రాజ్ యాదవ్, సత్తయ్య కురుమ, బట్టు మురలి జగన్ ముదిరాజ్, బత్తుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.