Monday, December 23, 2024

మహిళా వికలాంగుల సాధికారత కోసం ఉద్యమం

- Advertisement -
- Advertisement -

మార్చి 23, 24 తేదీల్లోమహిళా వికలాంగుల రాష్ట్ర సదస్సు
వాడవాడల్లో జెండా ఆవిష్కరణలు, రక్త దాన శిబిరాలు
ఎన్‌పిఆర్‌డి రాష్ట్ర కమిటీ నిర్ణయం

మన తెలంగాణ / హైదరాబాద్ : మహిళా వికలాంగులకు సాధికారత, విద్యా, స్వయం ఉపాధి, ఆరోగ్యం, భద్రత కల్పించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పిఆర్‌డి) రాష్ట్ర కమిటి డిమాండ్ చేసింది. మార్చి 23,24 తేదీల్లో హైదరాబాద్ లో మహిళా వికలాంగుల తొలి సదస్సు నిర్వహించనున్నట్లు ఎన్‌పిఆర్‌డి రాష్ట్ర కార్యదర్శి ఎం అడివయ్య తెలిపారు. శనివారం వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటి సమావేశం చిక్కాడపల్లి రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు జెర్కొని రాజు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా అడివయ్య మాట్లాడుతూ మహిళా వికలాంగుల సదస్సుకు 33 జిల్లాల నుండి 600 మంది ప్రతినిధులు హాజరు కానున్నట్లు తెలిపారు.

ఈ సదస్సులో మహిళా వికలాంగుల స్థితిగతులపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. మహిళలను సామాజిక, రాజకీయ, ఆర్థిక రంఘాల్లో సమాన భాగస్వామ్యం కలిపించే లక్ష్యంతో 1975 నుండి ఐక్య రాజ్య సమితి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. .దేశంలో మహిళలు, మహిళా వికలాంగులపై వేధింపులు, అత్యాచారాలు పెరిగి పోతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. మహిళల రక్షణ కోసం రాజ్యాంగంలో ఉన్న అంశాలు అమలుకు నోచుకోవడం లేదని, రాష్ట్రంలో సుమారు 4 లక్షల మంది మహిళా వికలాంగులు ఉన్నారన్నారు. ఐక్య రాజ్య సమితి హక్కుల ఒప్పందం పత్రంలోని ఆర్టికల్ 3,6లలో మహిళా వికలాంగుల హక్కులు పొందుపరచినా అమలు కావడం లేదని, మహిళా వికలాంగుల్లో వివాహం కానీ వారి సంఖ్య సకాలంగా మహిళలతో పోల్చితే 4రేట్లు అధికంగా ఉందని ఉన్నతి అనే సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైందన్నారు.

మహిళా మానసిక వికలాంగులు 70శాతం లైంగిక దూరక్రమణకు గురవుతున్నారని, గృహహింస చట్టంలోని సెక్షన్ 3(బి),(డి)మహిళా వికలాంగులు వినియోగించుకోవడం లేదన్నారు. మహిళా వికలాంగుల హక్కులు, రక్షణ కోసం ఎన్‌పిఆర్‌డి నిరంతరం పోరాడుతుందన్నారు. మహిళా వికలాంగులపై వేధింపులు అరికట్టేందుకు ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని, మహిళా వికలాంగులను వివాహం చేసుకున్న వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని, పెండ్లి కానీ మహిళా వికలాంగులకు ప్రభుత్వమే హోమ్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మహిళా వికలాంగుల సాధికారత విద్యా, స్వయం ఉపాధి,ఆరోగ్యం సంరక్షణ, రక్షణ కల్పించేందుకు ప్రభుత్వాలు కృషి చేయాల్సిని కోరారు. ఎన్‌పిఆర్‌డి 14 ఏండ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఫిబ్రవరి 21నుండి 28 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్‌పిఆర్‌డి ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాలు జరుపుతున్నామని తెలిపారు. 21న వాడవాడల్లో జెండా ఆవిష్కరణలు చేయాలని పిలుపునిచ్చారు. వారం రోజుల పాటు మొక్కలు నాటడం, రక్త దాన శిబిరాలు, పండ్ల పంపిణి వంటి సేవా కార్యక్రమలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షలు బి.స్వామి, రాష్ట్ర సహాయ కార్యదర్శులు పి.బాలేశ్వర్, జె.దశరథ్, వి.ఉపేందర్, రాష్ట్ర కమిటీ సభ్యులు కె.లలిత, ఏ.భుజంగా రెడ్డి, ఎ.లింగయ్య, ఎ.రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News