Wednesday, January 22, 2025

నేల తల్లి విముక్తి కోసం..

- Advertisement -
- Advertisement -

తెలంగాణ సమాజంలో భూమికోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిగిన పోరాటాలెన్నో… అనుసరించిన మార్గాలు ఎన్నేన్నో… తెలంగాణ తొలి ఉద్యమం మొదలుకొని రాష్ట్ర సాధన కొరకు కొనసాగిన మలి దశ ఉద్యమ తుదిలోనూ అసువులు బాసిన అమరులెందరో… ప్రజాయుద్ధ పంథాలో అనుసరించిన మార్గాలు మరెన్నో… ఎవరు ఏ మార్గం అనుసరించినా, ఏ ఉద్యమం చేపట్టినా తుదకు వారి లక్ష్యం ఒక్కటే. పుట్టిన మట్టి తల్లిని బంధనాల నుండి విడిపించడమే. అందుకోసం అనేక ప్రాంతాలలో అనేక ఉద్యమాలు అనేక మార్గాలలో అనేకమంది నడిపించారు. అట్లా కొనసాగిన ఉద్యమాలలో తెలంగాణ సాయుధ పోరాటం అత్యంత కీలకమైనది.

అందులోనూ ఉమ్మ డి నల్లగొండ జిల్లా ప్రాంతాలలో జరిగిన కమ్యూనిస్టు పోరాట పరిణామాలు అత్యంత కీలకమైనవి. అది నుండి ఈ ప్రాంతంలో వందల మంది కమ్యూనిస్టు గెరిల్లాలు, నాయకులు, రైతులు జరిపిన పోరాటం ఫ్రెంచి విప్లవాన్ని తలపిస్తది. ఆ మహోత్తర పోరాటంలో ముఖ్య భూమిక పోషించి అమరులైన మందారాల జీవితాలను యాది చేసుకోవడం చరిత్రకు అవసరం. ఆ మహనీయుల త్యాగాలను అక్షర బద్దంతో మహా యజ్ఞం చేసి ‘అగ్ని కణాల’ పేరిట విప్లవోద్యమ చరిత్రను వెలువరించిన సంపాదకులు కోమటిరెడ్డి అనంతరెడ్డి అలియాస్ విజయ్ చేసినకృషి విశిష్టమైనది. దాదాపు 200పేజీలతో 148 మంది చరిత్రకు ఇక దొరకరు అనుకున్న వారిని ఏరి పుస్తక రూపంలో నిక్షిప్తం చేసి నేటి తరానికి అందించారు. ఇందులో వివరించిన ప్రతి వ్యక్తి గురించి వారు చేపట్టిన పోరాట ఘట్టాల గురించి తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

1935-2022 మధ్యకాలంలో తెలంగాణ ప్రాంత ప్రజల విముక్తి కోసం జరిగిన నల్లగొండ జిల్లా విప్లవోద్యమ చరిత్రను ఈ ‘అగ్ని కణాలు ‘ పుస్తకంలో వివరంగా కాకపోయినా సంక్షిప్తంగా తెలుపబడింది. మొదటినుంచి ఉమ్మడి నల్లగొండ జిల్లా అంటేనే ఒక ప్రత్యేకత ఉంది. ‘అయ్యా నీ బాంచెన్…కాల్మోక్త..దొర దండం ‘ అని పెట్టిన చేతులే కడకు విల్లంబులు, బరిసెలు బంధూకులందుకుని దొరల భూస్వాముల, నిజాం రక్కసి మూకల పీచమణిచాయి. పేద ప్రజల విముక్తి కోసం నియంతల క్రూర పాలన ఎదిరించి నెత్తురు జిమ్మిన మట్టి ముద్ద నల్లగొండ. నియంతల దుండడుగు చేతులకురేసి భూస్వామ్య వ్యవస్థ గుండెల్లో గుణపాలు దించిన విప్లవాల ఖిల్లా నల్లగొండ జిల్లా. బండెనుక బండి గట్టి వడిసెల రాళ్ళు నింపి జడివాన కురిపించి నైజామోని పైజాం ఊడదీసి నడుం కట్టిన నల్లగొండ ఏమి తక్కువ రా… దాన్ని కడుపులల్ల పోరాట పొత్తిల్లు దాగి ఉన్నవి . ఆరుట్ల దంపతుల ఆరాటం, కొమురం భీం పోరాటం ఐలమ్మ పౌరుషం, భీమిరెడ్డి సాహసం.. తుదకు శ్రీకాంతా చారి, వేణుగోపాల్ రెడ్డి మరణాలు ఏమి తక్కువరా నా నల్లగొండ… వీరులకు నిలయంబురా… ధీరులకు మొగసాల రా.. అని ప్రసిద్ధికెక్కింది. తెలంగాణలో నల్లగొండకు అంత గొప్ప చరిత్ర ఉంది.

అటువంటి ఈ గడ్డమీద భారత రైతాంగ చరిత్రలో ప్రసిద్ధిగాంచిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించి అమరులైన వీరులెందరో ఉన్నారు. పది లక్షల ఎకరాల భూములను స్వాధీనపరుచుకున్నారు. దాదాపు 3వేల గ్రామాలలో గ్రామ రాజ్యాలు ఏర్పరచుకున్నారు. ఆనాటి నిజాం రాజు సడుగులిరిగి ఓటమి అంచున ఉన్నప్పుడు నెహ్రు సైన్యాలు దాడి చేశాయి. నిజాం వ్యతిరేక సైనిక చర్య పేరుతో జరిగిన దాడిలో కమ్యూనిస్టులు కూడా తీవ్రంగా నష్టపోయారు. ఎంతోమంది అమరులయ్యారు. అయితే మారిన వైరుధ్యాల నేపథ్యంలో కమ్యూనిస్టుల్లో ఒక వర్గం ఆనాటి పాలకవర్గానికి తొత్తులుగా మారారు.1964-67 కమ్యూనిస్టు పార్టీ చీలికల్లో ఈ అమరులు విప్లవ రాజకీయాలను ఎత్తిపట్టారు. నక్సల్బరీ సైదాంతిక పునాదితో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టు విప్లవకారుల సమన్వయ కమిటీ నిర్మాణంలో కొనసాగారు. మరి కొంతమంది నక్సలుబరి శ్రీకాకుళ సాయుధ పోరాటాలలో చేరారు. ఎమర్జెన్సీ తర్వాత గోదావరి లోయ ప్రతిఘటన పోరాటాల ప్రభావంతో రైతాంగ పోరాటాలు వెల్లువెత్తాయి. సిరిసిల్ల, జగిత్యాల పోరాటాల విలువలో ఎంతోమంది యువతరం పోరాటంలో పాల్గొన్నారు.

అటువంటి వారిలో దేవులపల్లి వెంకటేశ్వరరావు, ఎర్ర బోతు రాంరెడ్డి, కామ్రేడ్ విక్రమ్, అలుగుబెల్లి వెంకట నరసింహారెడ్డి, బండ్రు నర్సింహులు, కట్టా నరసింహారెడ్డి, కామ్రేడ్ షేక్ శంషుద్దీన్, గుండ్ల సైదిరెడ్డి, మనుమద్దె నరసింహ, చింత మల్లయ్య, యానాల వెంకట్రెడ్డి, గంజి వెంకటేశ్వర్లు, తోట సోమయ్య, ఊట్కూరి మారయ్య, మొగుళ్ళ వెంకటేశం, యానాల లక్ష్మమ్మ, కొండవీటి గుర్నాథ్ రెడ్డి,వంటి వారు ఎంతో మంది ఉన్నారు. అటువంటి వారిలో కామ్రేడ్ పన్నాల పుల్లారెడ్డి ఒకరు. పోరాటాల వెంట నిలబడ్డ ఆంధ్ర కేసరిగా పేరుగాంచిన పుల్లారెడ్డి నకిరేకల్ గ్రామానికి చెందినవారు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఇతను అదే గ్రామంలోని దేశముఖ్ నరసింహ రెడ్డికి వ్యతిరేకంగా సబ్బండ ప్రజలను ఐక్యం చేసి వెట్టిచాకిరి,అక్రమ పన్నులు చెల్లించవద్దని ప్రజలను చైతన్యం చేయడంలో నాయకత్వం వహించారు. ప్రభుత్వానికి గానీ, దొరలకు గానీ, భూస్వాములకు గానీ వెట్టి చేయమని హెచ్చరించాడు. వీరి నాయకత్వంలోనే నకరేకల్, నోముల, చందుపట్ల, తాటికల్లు,తదితర గ్రామాలలో ఆంధ్ర మహాసభ సంఘాలు స్థాపించడం జరిగింది.

స్వతంత్రం అనంతరం ఆరు సంవత్సరాలు జైలు జీవితం అనుభవించాడు.1952లో నకిరేకల్ సర్పంచ్ గా ఎన్నికై 12 సంవత్సరాల పాటు సర్పంచ్ గా పని చేసి అభివృద్ధి చేశాడు. అదేవిధంగా డి.వి.గా పేరుగాంచిన దేవులపల్లి వెంకటేశ్వరరావు 1940లో కమ్యూనిస్టు పార్టీలో చేరి ఆర్గనైజర్ నుండి అత్యున్నతస్థాయి కమిటీలో కొనసాగుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట రథసారథిగా , రూపశిల్పిగా విప్లవోద్యమ చరిత్రలో కీలక పాత్ర పోషించారు. ఓ వితంతువును పెళ్లాడి ఆదర్శ జీవితం గడిపాడు. భూస్వాములకు వ్యతిరేకంగా కౌలు రైతుల పక్షాన పోరాటం చేశారు. 1946 జూలై తరువాత పోరాటం తీవ్రమై సాయు ధ ప్రతిఘటనకు దారి తీయడంతో నిర్బంధం తీవ్రమైంది. దీంతో దేవులపల్లి రహస్య జీవితంలోకి వెళ్లారు. తన చొరవతోనే జనశక్తి పత్రికను 1972 లో పునరుద్ధరించారు.

కామ్రేడ్ దేవుల పల్లి వెంకటేశ్వరరావు రాజకీయ జీవితమంతా రహస్యంగా గడుపుతూ పోరాటంలో ప్రధాన పాత్ర పోషించారు. అనేకసార్లు జైలు జీవితం గడిపాడు. కమ్యూనిస్టు పార్టీలో చేరినప్పటి నుండి 1984 చనిపోయే వరకు కచ్చితంగా పార్టీ క్రమశిక్షణను పాటించారు. గొప్ప సిద్ధాంత కర్త. విప్లవ ఉద్యమ నిర్మాణంలో ప్రముఖుడు. కమ్యూనిస్టు విప్లవకారులకు ఆదర్శంగా నిలిచిన త్యాగధనుడు. భారత విప్లవ శ్రేణుల్లో చిరస్మరణీయుడు. నాడు తెలంగాణలో నిజాం నిరంకుశ రాజ్యము రాబందులైన భూస్వామ్య వర్గాలు జమీందార్ల దాష్టికత్వంలో ప్రజలు తమ ధన, మాన, ప్రాణాలను పోగొట్టుకున్నారు. ప్రజల పక్షం వహించిన కమ్యూనిస్టు నాయకులను కాల్చి చంపారు. ఉరిశిక్షలు విధించారు. అలా ఉరిశిక్ష విధించబడిన 15 సంవత్సరాల మైనారిటీ బాలుడు నల్లగొండ జిల్లా అప్పాజీపేట గ్రామానికి చెందిన కామ్రేడ్ ఎర్రబోతు రాంరెడ్డి అగ్రగణ్యుడు. ఇతని పేరు, చిత్రపటం అంతర్జాతీయ నిరసన ఉద్యమంలో ఊరేగింది. జాతీయంగా,అంతర్జాతీయంగా జరిగిన ఉద్యమాల ఒత్తిడితో ఉరిశిక్ష రద్దు చేయబడింది.. ఆనాడు దోమలపల్లి రజాకార్ల క్యాంప్ పై దాడికి ఎర్రబోతు రామిరెడ్డి నాయకత్వం వహించాడు.

భూస్వాములకు వ్యతిరేకంగా భూమి సమస్యలపై రాంరెడ్డి ప్రజలను కదిలించాడు. కల్లపల్లి భూస్వామి యాదగిరిరావు 500 ఎకరాల భూమిని ప్రజలకు పోరాడి పంచిపెట్టారు.1948లో పోలీసులు పన్నిన కుట్రపలితంగా ఎర్రబోతు రాంరెడ్డి నార్కట్పల్లి,నల్గొండ పోలీస్ స్టేషన్ లో చిత్రహింసలకు గురయ్యారు. చౌడంపల్లి పట్వారి హత్యాయత్నం కేసు, చిన్న నారాయణపురం జంట హత్య కేసులు బనాయించబడ్డాయి. ఏడు సంవత్సరాల తర్వాత 1956 లో జైలు నుండి ఎర్రబోతు రామిరెడ్డి విడుదలయ్యారు. ఈ కామ్రేడ్ విద్యార్థి దశ నుండి భూమికోసం, భుక్తి కోసం,విముక్తి కోసం సాగిన విరోచిత పోరాటంలో పాల్గొన్నారు. ఉరికొయ్యలని ఎగతాళి చేశాడు. జైలును విద్యాలయంగా మార్చుకున్నాడు. తన జీవితాంతం విప్లవ రాజకీయాలు కలిగి కమ్యూనిస్టు విలువలతో ఆదర్శంగా ప్రజల మధ్య జీవించాడు. ఆయన పట్టుదల,త్యాగం నేటి తరానికి ఎంతో మార్గదర్శకం.

ప్రజా ప్రతినిధిగా ఎన్నికై నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేశాడు. ఈ విధంగా అలుగుబెల్లి వెంకట నరసింహారెడ్డి, బండ్రు నరసింహులు, యానాల చంద్రారెడ్డి, మొగుళ్ళ వెంకటేశం వసంతా దంపతులు, యానాల లక్ష్మమ్మ, కట్ట నరసింహారెడ్డి, వంటి వారు ఎంతో మంది ప్రముఖులు మహోత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రముఖ పాత్ర వహించారు.1968లో కామ్రేడ్ దేవులపల్లి వెంకటేశ్వరరావు, తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి, కొల్లా వెంకయ్య గార్ల నాయకత్వంలో జరిగిన పోరాటంలో భాగస్వాములయ్యారు.
వీరందరూ మైదాన ప్రాంతంలో గాని అడవి ప్రాంతంలో గాని జరిగిన ఉద్యమాలలో కీలక పాత్ర వహించారు. దోపిడి పీడనలేని ప్రజారాజ్య స్థాపన కొరకు ఎనలేని కృషి చేశారు. ప్రజాయుద్ధ పంథాలో నూతన ప్రజాస్వామిక విప్లవ లక్ష్యంగా పని చేశారు. ప్రజల కోసం, విప్లవం కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారు.

నాలుగు దశాబ్దాల తన ఉద్యమ పరిచయాలతో రచయిత అనంతరెడ్డి విప్లవ సంస్థలకు సంబంధించిన అమరవీరుల త్యాగాలను వారి విప్లవ జీవితాలను నల్లగొండ విప్లవోద్యమంలో ఒకచోట చేర్చి గ్రంథస్తం చేయడం అంత సులువు కాదు. శక్తికి మించిన భారమే అవుతుంది. ఒక రచయితగా తాను పడిన కష్టనష్టాలు తానేరుగుదును. ఈ వర్గ సమాజంలో ప్రజల కోసం ప్రాణాలొడ్డిన అమరవీరులకు ఈ అగ్ని కణాలు అంకితమివ్వడం నిజంగా గొప్ప విషయమే. రచయితగా ఉన్న అనంతరెడ్డి సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ లో కార్యకర్త స్థాయి నుండి వివిధ రూపాలలో పని చేశారు. అనేక పోరాటాలకు నాయకత్వం వహించారు. అందుకనే అమరులైన వ్యక్తుల యొక్క విషయాలన్నింటినీ ఎంతో కష్టపడి ఇష్టంగా ఈ ‘అగ్ని కణాలు’ వెలువరించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రలో, నల్లగొండ జిల్లా విప్లవోద్యమ చరిత్రలో ఈ గ్రంథం ఎప్పటికీ చిరస్మరణీయం. రచయితకు హృదయపూర్వక అభినందనలు. పాఠకులందరూ ఈ ‘అగ్ని కణాల’ను ఆస్వాదించాలని, ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

కోమటి రెడ్డి బుచ్చిరెడ్డి
94415 61655

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News