చనిపోయిన పంది గుండెలో కదలిక
అమెరికా సైంటిస్టుల ఘనత
మానవ చికిత్సలకు ఊతం
వాషింగ్టన్ : మృత కణాల పునరుద్ధరణ, వాటిలో తిరిగి కదలికల శాస్త్రీయ ప్రక్రియలో కీలకమైన ముందడుగు పడింది. చనిపోయిన పందిలోని కణాలు తిరిగి పనిచేయించే ప్రక్రియలో అమెరికా సైంటిస్టులు విజయం సాధించార. ఇది అవయవ మార్పిడి, కణజాల పున : చైతన్యం వంటి ప్రధాన విషయాలలో సైన్స్ విజయంగా నమోదు అయింది. సాధారణంగా ఏ జీవిలో కానీ కణమే జీవన లక్షణానికి ప్రధాన అంతర్భాగం, మృతకణాలతో శరీర వ్యవస్థ అచేతనం అయ్యి, తిరిగి కోలుకోలేని దుస్థితి, చివరికి మరణాలు సంభవిస్తాయి. చనిపోయిన పందిలోని మృతకణాలను సేకరించి వాటిలో తిరిగి జీవ ప్రక్రియ తలెత్తేలా చేసే సరికొత్త టెక్నాలజీని యాలే స్కూల్ ఆఫ్ మెడిసిన్ సైంటిస్టుల బృందం ఆవిష్కరించింది. మృత జీవుల అవయవాలు, కణజాలాలకు ప్రత్యేకంగా రూపొందించిన కణ జాల పరిరక్షక ద్రవ్యాన్ని రంగరించడం ద్వారా అవి తిరిగి పుంజుకుని పనిచేయడం వంటి అంశాలను గుర్తించారు.
సాధారణంగా జీవజాలంలోని కణాలు వెంటనే చనిపోవు. పలురకాల అంతర్గత, సుదీర్ఘ ప్రక్రియల తరువాతనే కణాలు అంతరించిపోయినట్లుగా భావించాల్సి ఉంటుందని పరిశోధకులలో ఒకరైన డేవిడ్ అండ్రిజెవిక్ తెలిపారు. మృతి తరువాత కణాల ప్రక్రియను ప్రాతిపదికగా చేసుకుని వీటిని తిరిగి పునరుద్ధరించే దిశలో చర్యలు తీసుకోవచ్చు. కణాలు పూర్తిగా అంతరించిపోకుండా చేయవచ్చు. చివరికి అవి తిరిగి పనిచేసేలా చూడవచ్చు అని సైంటిస్టులు తెలిపారు. ఓ పందిపై బ్రెయిన్ ఎక్స్ వినూత్న శాస్త్రీయ ప్రక్రియను ప్రయోగించి క్రమేపీ రక్త ప్రసరణ , తిరిగి కొంత మేర కణజాల పునరుద్ధరణకు దిగినట్లు వివరించారు. పంది చనిపోయిన తరువాత గంట సేపటికి ఈ కొత్త టెక్నాలజీని వాడారు. ఈ దశలో ఆరుగంటల తరువాత దీని గుండె , కాలేయం, కిడ్నీలు పనిచేసినట్లు సైంటిస్టులు తెలిపారు. సర్జరీల దశలో వ్యక్తులలో కణజాలాలు చచ్చుబడి పోవడం, అవయవాల మార్పిడి దశలో క్లిష్టతలు వంటి విషయాలకు విరుగుడుగా ఈ కణజాల పునరుద్ధరణ ప్రక్రియను బాగా వాడుకోవచ్చునని సైంటిస్టులు భావిస్తున్నారు.