30 కోట్ల మంది కార్మికులు,
ఉద్యోగులు సమ్మె చేయడం ప్రధాని మోడీకి చెంపపెట్టు
సిపిఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి,
ఎఐబిఇఎ జాతీయ కార్యదర్శి బి.ఎస్.రాంబాబు హెచ్చరిక
మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బ్యాంకుల ప్రైవేటీకరణ విధానాలను ఉపసంహరించుకుని ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిరక్షణకు చర్యలు తీసుకునేంతవరకు ఉద్యమం ఆగదని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి హెచ్చరించారు. దేశంలోని దాదాపు 30 కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు సమ్మె చేయడం ప్రధాని మోడీకి చెంపపెట్టు అని అన్నారు. సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేయనున్నట్లు కార్మిక, ఉద్యోగ సంఘాలు ప్రకటించి నెలలు గడుస్తున్నా కనీసం వారితో చర్చలు జరపని దౌర్భమైన ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం అని అన్నారు. బిజెపి ప్రభుత్వ కార్మిక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల అసోసియేషన్ (ఎఐబిఇఎ), అఖిల భారత బ్యాంకు అధికారుల అసోసియేషన్ (ఎఐబిఓఎ) సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ బ్యాంక్ స్ట్రీట్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంగణంలో పెద్ద ఎత్తున ధర్నా జరిగింది. ఈ ధర్నాలో ఎఐబిఇఎ జాతీయ కార్యదర్శి బి.ఎస్.రాంబాబు, ఎఐబిఓఎ ప్రధానకార్యదర్శి వి.అనిల్ కుమార్, కార్యదర్శి ఐ.హరినాథ్, ఉపాధ్యక్షులు శ్రీధర్, ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు డి.పాపారావు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బ్యాంక్ ఎంపాయీస్ ఫెడరేషన్(ఎపిటిఎస్) డిప్యూటీ జనరల్ సెక్రటరీ పి.వి.కృష్ణారావు, కార్యదర్శి ఫణికుమార్, జాయింట్ సెక్రటరీ కృష్ణ, కోటక్ మహేంద్రా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ జాతీయ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, సిబిఐయు తెలంగాణ, ఎపి ప్రధాన కార్యద్శి ఉదయ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవార్డ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సమద్ ఖాన్, అఖిల భారత బీమా ఉద్యోగుల సమాఖ్య సౌత్ సెంట్రల్ జోనల్ ప్రధాన కార్యదర్శి వి.రఘునాధన్, ఎఐబిఇఎ రాష్ట్ర నాయకులు రవీంద్రనాథ్, జానకిరామ్ తదితరులు పాల్గొన్నారు.
వివిధ బ్యాంకులకు చెందిన ఉద్యోగులు, అధికారులు తమ విధులను బహిష్కరించి పెద్ద సంఖ్యలో ధర్నాలో పాల్గొన్నారు. ఫలితంగా గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని దాదాపు అన్ని బ్యాంకులలో కార్యకలాపాలు స్థంభించిపోయాయి. ధర్నాను ఉద్దేశించి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ దేశంలో ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే బ్యాంకులకు నష్టాలొస్తే పరిష్కరించాల్సిన కేంద్ర ప్రభుత్వం లాభాల్లో ఉన్న జాతీయ బ్యాంకులను కూడా ప్రైవేటీకరించేందుకు పూనుకోవడం గర్హనీయమన్నారు. ఇంట్లో ఎలుకలు ఉన్నాయని ఇల్లును తగులబెట్టిన విధంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
బ్యాంకులకు నష్టాలు రావడానికి ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వాలు ప్రొత్సహిస్తున్న కార్పొరేట్ సంస్థలు, ప్రైవేట్ వ్యక్తులేనన్నారు. బ్యాంకులకు రుణాలు ఎగవేసి విదేశాలకు వెళ్లిన దొంగలకు మోడీ ప్రభుత్వం సహకరించడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు. బ్యాంకులకు రుణాలను ఎగవేసే కార్పొరేట్ సంస్థలు, వ్యక్తులను సమాజంలో ద్రోహులుగా నిలబెట్టాలన్నారు. అధికారం చేతుల్లో ఉంది కదా అని మోడీ ప్రభుత్వం నిర్ధక ఆస్తుల ఎన్.పి.ఎ పేరుతో కార్పొట్ సంస్థలకు లక్షల కోట్ల రుణాలను మాఫీ చేయడం దుర్మార్గమన్నారు. ఎన్.పి.ఎ వసూలు చేసే బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.