Monday, December 23, 2024

అవినాష్ సిబిఐ సీరియస్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : వివేకా హత్య కేసులో ఎంపి అవినాష్ రెడ్డి మరోసారి సిబిఐ విచారణకు హాజరు కాలేదు. సిబిఐ విచారణకు హాజరయ్యేందుకు పులివెందుల నుంచి హైదరాబాద్ వచ్చిన ఆయన శుక్రవారం ఉదయం పది గంటల సమయంలో సిబిఐ విచారణకు బయలుదేరారు. అయితే అదే సమయంలో ఆయనకు పులివెందుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆయన తల్లి అనారోగ్యంతో పులివెందుల ఆస్పత్రిలో చేరారన్న సమాచారం వచ్చింది. దీంతో ఆయన సిబిఐ విచారణకు రాలేనని తన తల్లి ఆరోగ్యం బాగోలేకపోవడంతో పులివెందులకు వెళ్తున్నానని సిబిఐ అధికారులకు లేఖ రాసి హైదరాబాద్ నుంచి వెళ్లిపోయారు. అయితే అవినాష్ రెడ్డి రాసిన లేఖ విషయంలో సిబిఐ అధికారులు సానుకూలంగా స్పందించలేదు. అవినాష్ రెడ్డి తీరుపై సిబిఐ సీరియస్ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది.

మరో వైపు సీబీఐ కోర్టు వద్ద అవినాష్ రెడ్డి అనచరులు మీడియా ప్రతినిధులపై దాడులు చేశారు. అవినాష్ రెడ్డి విచారణకు వస్తారని తెలియడంతో పలువురు మీడియా సంస్థల ప్రతినిధులు వచ్చారు. అక్కడకు పెద్ద ఎత్తున పులివెందుల నుంచి వచ్చిన అవినాష్ రెడ్డి అనుచరులు కూడా గుమికూడారు. అవినాష్ రెడ్డి రావడం లేదని విషయం తెలిసిన తర్వాత మీడియా కవరేజీ ఇస్తున్న వాహనాలపై దాడి చేశారు. ఓ తెలుగు మిడియా చానల్ వాహనాన్ని, కెమెరాలను ధ్వంసం చేశారు. ఇద్దరు ప్రతినిధుల్ని కూడా గాయపరిచారు. అరెస్ట్ చేస్తారనే భయంతోనే అవినాష్ రెడ్డి విచారణకు హాజరు కావడం లేదని చెబుతున్నారు. మూడు రోజుల కిందట కూడా వ్యక్తిగత కారణాల పేరు చెప్పి విచారణకు హాజరు కాలేదు వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడా ఊరట లభించలేదు.

విచారణకు రాలేదు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐకి చట్ట పరమైన అడ్డంకులు ఏమీ లేవు. అయితే అవినాష్ రెడ్డిని ఇతర నిందితుల్ని అరెస్ట్ చేసినట్లుగా చేయలేదు. అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే తెల్లవారుజామునే ఇంటికి వెళ్లి అరెస్ట్ చేశారు. కానీ అవినాష్ రెడ్డి విషయంలో నోటీసులు జారీ చేసి విచారణకు పిలుస్తున్నారు. ఖచ్చితంగా అరెస్ట్ చేసి విచారణ జరిపితే వివరాలు తెలుస్తాయని కోర్టులో సిబిఐ చెప్పింది. అయినా వ్యూహాత్మకంగానే అరెస్ట్ చేయలేదన్న వాదన వినిపిస్తోంది. విచారణకు పిలిచినప్పుడల్లా రాకపోతూండటంతో ఆయన విచారణకు సహకరించడం లేదని సిబిఐ కోర్టుకు చెబుతోంది. అయినప్పటికీ అవినాష్ రెడ్డి రకరకాల కారణాలతో డుమ్మా కొడుతున్నారు.
అవినాష్ పారిపోవట్లేదు –సిబిఐ విచారణకు సహకరిస్తున్నారన్నసజ్జల
అవినాష్ రెడ్డి పారిపోవడం లేదని సిబిఐ విచారణకు సహకరిస్తున్నారని ఎపి ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన అవినాష్ రెడ్డిపై మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. సిబిఐ విచారణకు హాజరయ్యేందుకే అవినాష్ రెడ్డి హైదరాబాద్ వచ్చారన్నారు. తల్లికి అనారోగ్యంగా ఉందన్న సమచారం రావడం వల్లనే ఆయన విచారణకు హాజరు కాకుండా పులివెందుల వెళ్లారని, ఇవాళ కాకపోతే రేపైనా సిబిఐ ముందు హాజరవుతారని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మీడియానే వెంటపడుతోందని ఆరోపించారు.
మీడియాపై దాడిని ఖండించిన గవర్నర్ తమిళిసై
మీడియా సిబ్బందిపై జరిగిన దాడిని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తీవ్రంగా ఖండించారు. మీడియా మీద దాడి.. ప్రజాస్వామ్యంపై దాడేనన్నారు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించారు. అంతకుముందు మీడియాపై దాడి ఘటనపై మీడియా ప్రతినిధులు గవర్నర్ తమిళిసై దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆమె పై విధంగా స్పందించింది.
మీడియా వాహనంపై అవినాశ్ అనుచరుల దాడి హేయం : చంద్రబాబు
వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు సంబంధించి వార్తలు కవర్ చేస్తున్న ఓ తెలుగు మీడియా చానల్ ప్రతినిధులపై ఎంపీ అనుచరులు దాడి చేశారని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. మీడియా వాహనాలను ధ్వంసం చేయడం హేయమైన చర్య అని విమర్శించారు. ‘ఇదే మీ విష సంస్కృతికి నిదర్శనం. మీడియా వాహనంపై దాడి చేస్తే సిబిఐ వాహనం వెంటాడకుండా ఉంటుందా? అరెస్ట్ ఆగుతుందా?‘ అని చంద్రబాబు ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News