Wednesday, January 22, 2025

స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే రుణమాఫీ డ్రామా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్‌ః స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ డ్రామా చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. రైతులకు ఇచ్చే భరోసా, బీమా వంటివి ఎగ్గొట్టి వాటి స్థానంలో రుణమాఫీ చేస్తున్నారని మండిపడ్డారు. రైతు రుణమాఫీ అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిందని ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏం సాధించారని సంబరాలు చేసుకుంటున్నారో చెప్పాలన్నారు. రబీ, ఖరీఫ్‌లో చెల్లించాల్సిన రైతు భరోసా సొమ్ము ఎగ్గొట్టినందుకా? రుణమాఫీలో కోత పెట్టి రైతులను మోసం చేసినందుకా? అని ఎద్దేవా చేశారు. పంట నష్టపరిహారం ఇవ్వకుండా అన్నదాతలను గోస పెట్టినందుకు సంబరాలు చేసుకుంటున్నారా? అని నిలదీశారు. గత ఎన్నికల్లో రూ.2 లక్షల్లోపు రుణాలు తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, కొర్రీల మీద కొర్రీలు పెడుతూ కొద్దిమందికే రుణమాఫీ చేయడం దుర్మార్గమని అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 39 లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తుంటే, వారిలో 11 లక్షల మందికి మాత్రమే రుణమాఫీని వర్తింపజేయడటం అన్యాయమని పేర్కొన్నారు. ఈ లెక్కన నూటికి 70 శాతం మంది రైతులకు రుణమాఫీ వర్తించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి లెక్కల ప్రకారం రాష్ట్రంలో రైతులు తీసుకున్న రుణాల మొత్తం రూ.64 వేల కోట్లకు పైమాటేనని అన్నారు. అందులో 10వ వంతు మాత్రమే చెల్లించి సంబురాలు చేసుకోవడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. సంబురాలు చేసుకునేందుకు కాంగ్రెస్ సిద్ధపడటం సిగ్గు చేటని విమర్శించారు. తెలంగాణలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు భరోసా పేరుతో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రబీ, ఖరీఫ్ సీజన్లో రైతులకు, కౌలు రైతులకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా సదస్సుల పేరుతో జాప్యం చేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తారా..? అని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News