గాడిద గుడ్డు పెట్టడం ఎంత నిజమో, కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం కూడా అంతే నిజమనే, దానికి రాష్ట్ర బడ్జెట్ నిదర్శనమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్ + రాష్ట్ర బడ్జెట్ = గాడిద గుడ్డేనా?, 6 గ్యారంటీలు + రాష్ట్ర బడ్జెట్ = గాడిద గుడ్డేనా? అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర బడ్జెట్‌పై బండి సంజయ్ గురువారం స్పందిస్తూ భట్టి విక్రమార్క చదివింది ఆర్దిక బడ్జెట్టా లేక అప్పుల పత్రమా? అని ఎద్దేవా చేశారు. అప్పులున్నందున హామీలను అమలు చేయలేమని చేతులెత్తేస్తున్నారా? అని ప్రశ్నించారు. అప్పులున్న విషయం ముందు మీకు తెలిసి కూడా 6 గ్యారంటీలిచ్చిన మీరు వాటన్నింటికీ బడ్జెట్ లో నిధులెందుకు కేటాయించలేదని నిలదీశారు.
6 గ్యారంటీలు సహా హామీల అమలుపై చర్చ జరగకుండా ఉండేందుకే కేంద్రాన్ని బదనాం చేయాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. బడ్జెట్ కేటాయింపులకు సరిపడ ఆదాయం ఎక్కడి నుండి సమకూర్చుకుంటారో బడ్జెట్‌లో లెక్కా పత్రం చూపకపోవడం విడ్డూరమని అన్నారు. సర్కారీ భూములన్నీ అడ్డికి పావుశేరు అమ్మాలనుకుంటున్నారా అని అన్నారు. హామీలను అమలు చేయడం చేతకాని కాంగ్రెస్‌కు మాటలెక్కువని బడ్జెట్ చూస్తే అర్ధమవుతోందని విమర్శించారు.
31 వేల ఉద్యోగాల భర్తీ చేశామనడం నిరుద్యోగులను మోసగించడమే
12 వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చిన మీరు 31 వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పడం నిరుద్యోగులను మోసం చేయడమే అవుతుందని అన్నారు. రూ.లక్షన్నర కోట్లతో నిర్మిస్తామన్న మూసీ రివర్ ఫ్రంట్‌కు బడ్జెట్‌లో పైసా కూడా కేటాయించని మీరా కేంద్రంపై విమర్శలు చేసేదని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రంజాన్ వేడుకలకు రూ.33 కోట్లు కేటాయించిన ప్రభుత్వం హిందువుల పండుగలకు నయాపైసా కేటాయించకపోవడం మతతత్వం కాదా? అని అన్నారు. ఒక వర్గం ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ మెజారిటీ హిందూ ప్రజలకు తీవ్రమైన నష్టం చేయడమేనా మైనారిటీ డిక్లరేషన్ అంటే అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. రుణమాఫీవల్ల రైతులకు లాభం కంటే నష్టమే జరిగిందని ప్రభుత్వమే ఒప్పుకుందని అన్నారు. రైతులకు జరిగిన నష్టాన్ని పూడ్చి డిఫాల్టర్ల జాబితా నుండి తొలగిస్తారా? లేదా? చెప్పాలని అన్నారు.
ఇప్పటికైనా పీఎం ఫసల్ బీమాలో చేరాలని నిర్ణయించడం సంతోషమని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను రాబోయే ఐదేళ్లలో కూడా అమలు చేయడం అసాధ్యమని బడ్జెట్ లోనే తేలిందని తెలిపారు. బడ్జెట్ లో ఏ ఒక్క నియోజకవర్గం ఊసే లేదు, సీఎం సహా మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో తెలంగాణ పేరు రాలేదని రాష్ట్రానికి ఘోర అన్యాయం ప్రజలను రెచ్చగొట్ట్టిన కాంగ్రెస్ నేతలు రాష్ట్ర బడ్జెట్ లో ఏ ఒక్క జిల్లా, నియోజకవర్గం ప్రస్తావన చేయలేదు కదా దీనికేం సమాధానం చెబుతారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ లో పేరు ప్రస్తావించకపోయినంత మాత్రాన ఆ ప్రాంతాలకు అన్యాయం చేసినట్లా? రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తారా అని కాంగ్రెస్ మంత్రులపై ధ్వజమెత్తారు.