Monday, December 23, 2024

కేంద్ర నిధులతోనే తెలంగాణలో అభివృద్ది: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

కోరుట్ల: కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతోనే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ది పనులు జరుగుతున్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ అన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 13వ రోజు కోరుట్ల మండలం మోహన్ రావు పేట గ్రామంలో ఆదివారం గ్రామస్థులతో బండి సంజయ్ రచ్చబండ నిర్వహించారు. పలువురు గ్రామస్థులు సమస్యలను ఏకరువు పెట్టారు. బండి సంజయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న పేదల స్థితిగతులు తెలుసుకునేందుకు నేను పాదయాత్ర చేస్తుంటే సిఎం కెసిఆర్ నన్ను చంపి ఆరు ముక్కలు చేస్తాడట అని అన్నారు. సిఎం కెసిఆర్ మోసపూరిత ఉద్యోగ ప్రకటనలు వేసి నిరుద్యోగులతో చెలగాటం ఆడుతున్నారని మండి పడ్డారు.

గల్ఫ్ కార్మికుల సమస్యలు పట్టించుకొని నీచమైన ప్రభుత్వం కెసిఆర్ ప్రభుత్వం అని ధ్వజమెత్తారు. మోదీ పేరు చెప్పి కరెంట్ మోటార్లకు మీటర్లు పెట్టాలని చూస్తున్న ప్రభుత్వానికి నూకలు చెల్లుతాయని బండి సంజయ్ ఆరోపించారు. ఎన్నికల కోసమో, ఓట్ల కోసమే మహా సంగ్రామ యాత్ర చేయడం లేదని, ప్రజల సమస్యల్ని తెలుసుకునేందుకే పాదయాత్ర చేస్తున్నట్లు సంజయ్ పేర్కొన్నారు. నియంత పాలనతో రాష్ట్ర ప్రజలను దోచుకున్న ప్రతి ఒక్కరిని జైలుకు పంపేదాక పోరాటం ఆపేది లేదన్నారు. తెలంగాణలో బిజెపి డబుల్ ఇంజన్ సర్కారు రావడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యాత్ర ప్రముఖ్ కరండ్ల మధుకర్, కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్, జెఎన్ వెంకట్, సునీత, నాయకులు గుగ్గిల్ల తుక్కారాం గౌడ్, పంచిరి విజయ్ కుమార్, దాసరి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News