Wednesday, January 22, 2025

సిఎం రేవంత్‌రెడ్డికి ఎంపి బండి సంజయ్ లేఖ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః ఆర్ధిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి బండి సంజయ్ డిమాండ్ చేశారు. బుధవారం సిఎం రేవంత్‌రెడ్డికి చేనేత కార్మికుల సమస్యలపై లేఖ రాశారు. ఈసందర్భంగా పేర్కొంటూ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ తీవ్రమైన సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని, చేనేత రంగంపై ఆధారపడిన 20 వేల మంది కార్మికులు, వారి కుటుంబాలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్లలో 33 వేల మరమగ్గాలు ఉండగా అందులో 28 వేల మగ్గాలపై పాలిస్టర్ మగ్గాలు, 5 వేల మగ్గాలపై కాటన్ వస్త్రాలు తయారవుతున్నాయని, ఉత్పత్తి వ్యయం పెరగడం, పాలిస్టర్ బట్టకు గిట్టుబాటు ధర రాక, సరైన మార్కెట్ లేకపోవడంతో సాంచాలను బంద్ పెట్టారని తెలిపారు.

సంక్షోభానికి ప్రధాన కారణం గత ప్రభుత్వంతోపాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలేనని, గత ఏడేళ్లుగా ప్రభుత్వ ఆర్డర్‌పైనే ఆధారపడి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ మనుగడ సాగిస్తోందన్నారు. వస్త్ర ఉత్పత్తిదారులు సొంతంగా వస్త్ర వ్యాపారం చేయడం లేదని, ప్రధానంగా బతుకమ్మ చీరలకు సంబంధించి గత పాలకులు కార్మికులకు రూ.220 కోట్లను బకాయి పెట్టిందన్నారని, బకాయిలు రాకపోవడంతో వస్త్ర పరిశ్రమకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, బకాయిలను చెల్లిస్తామని స్థానిక ఎమ్మెల్యే కెటిఆర్ పలుమార్లు హామీ ఇచ్చిన, చివరకు ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపి బకాయిలు చెల్లించలేదన్నారు. కార్మికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత ప్రభుత్వం బకాయిలను వెంటనే చెల్లించాలని, ప్రత్యేక చొరవ తీసుకుని భారీగా ప్రభుత్వ ఆర్డర్లను ఇచ్చి కార్మికులను ఆదుకోవాలన్నారు. నేత కార్మికులను యాజమానులుగా మార్చేందుకు ఉద్యమనేత, మాజీ సిఎం కెసిఆర్ తన పాలనలో వర్కర్ టు ఓనర్ పథకం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు గుర్తు చేశారు.

తొలి విడతలో ఈ కార్యక్రమానికి రూ.220 కోట్లను కేటాయిస్తున్నామని, 1104 మంది కార్మికులను మొదటి దశలో ఓనర్లుగా మారుస్తామని ప్రకటించారని, కానీ ఇంతవరకు అది అమలు కాలేదన్నారు. అదే విధంగా కార్మికుల సంక్షేమం కోసం తక్షణమే నిధులు కేటాయించి నేత వర్కర్లను యాజమానులుగా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని సూచించారు. మరమగ్గాలను ఆధునీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, మరమగ్గాల ఆధునీకరణకు అవసరమైన నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారని, దానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రతిపాదనలు పంపితే, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరగా మంజూరు చేయించేందుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News