తెలంగాణలో లక్షలాది కుటుంబాలు గత పదేండ్లుగా ఇండ్లు కోసం అల్లాడుతుంటే నియోజకవర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ప్రాతిపదికన 3,500 ఇండ్లు ఇస్తామని ప్రకటించిందో స్పష్టం చేయాలని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ ప్రశ్నించారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న ప్రజాహిత యాత్రలో భాగంగా ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఉద్యోగులకు జీతాలే ఇవ్వలేని పరిస్థితి ఉందని, అప్పుల్లో ఉన్న తెలంగాణలో 6 గ్యారంటీలను అమలు చేయాలంటే రూ.5 లక్షలు కోట్లు అవసరమని, ఆ నిధులు ఎక్కడి నుండి తెస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ దోఖాబాజీ పార్టీ అని, ఆరు గ్యారెంటీల అమలులో ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ఓట్లు దండుకున్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వాటికి కోతలు పెడుతూ ప్రజలను మోసం చేస్తోందన్నారు.
దేశమంతా మోడీ హవా
దేశమంతా ప్రధాని మోదీ గాలి వీస్తోందని అన్నారు. నరేంద్రమోదీ లేని భారత్‌ను ప్రజలెవరూ ఊహించుకోవడం లేదన్నారు. మోదీని మూడోసారి ప్రధానిగా చేసేందుకు ప్రజలంతా సిద్ధమయ్యారన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే మహిళలకు ప్రతినెలా రూ.2500లు, ఆసరా కింద రూ.4 వేల పెన్షన్, రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా కింద రైతులకు రూ.15 వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇస్తారని భా వించారని, అవికూడా వంద రోజుల్లో ఇస్తారనుకున్నారని, కానీ వాటిలో ఇప్పటివరకు ఒక్క టి కూడా అమలు కాలేదని వ్యాఖ్యానించారు. 6 గ్యారంటీలతోపాటు మేనిఫెస్టోలోని హామీలన్నీ అమలు కావాలంటే రూ.5 లక్షల కోట్ల నిధులు అవసరమని, అప్పుల్లో ఉన్న తెలంగాణ ఎక్కడి నుండి నిధులు తీసుకొస్తారా? అని ప్రశ్నించారు. ఇప్పటికే రాష్ట్రంలో అర్హులైన 10 లక్షల మంది పేద కుటుంబాలకు ఇంతవరకు కొత్త రేషన్ కార్డులే ఇవ్వలేదన్నారు. వాళ్లకు 6 గ్యారంటీలకు అసలే నోచుకోవడం లేదన్నారు. పోనీ రేషన్ కార్డులున్న వాళ్లకైనా ఇస్తున్నారా? అంటే అదీ లేదు. రాష్ట్రంలో 90 లక్షల తెల్ల రేషన్ కార్డులుంటే..అందులో 40 లక్షల మందికి మాత్రమే 5 వందలకే గ్యాస్ సిలిండర్, 2 వందల యూనిట్లు ఉచిత కరెంట్‌ను అమలు చేస్తున్నారని తెలిపారు.
‘మిగిలిన 50 లక్షల మందికి కోత పెట్టిర్రు.. ఇప్పుడేమో నియోజకవర్గానికి 3 వేల 500 మందికి మాత్రమే ఇందిరమ్మ ఇండ్లను ఇస్తరట.. కొత్తవి కట్టిస్తారా.? శిథిలావస్థలో ఉన్న పాత ఇండ్లు ఇస్తరా.? రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల కుటుంబాలు ఇండ్ల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నయ్. దరఖాస్తుల మీద దరఖాస్తులు పెట్టి ఆఫీసుల చుట్టూ ఇన్నాళ్లు కాళ్లు అరిగేలా తిరిగిర్రు…ఇప్పుడేమో 3వేల 500 మందికే ఇస్తామంటే మిగిలిన వాళ్ల సంగతేంది’ అని ప్రశ్నించారు. ఒక్క మహాలక్ష్మి పథకానికి రూ.50 వేల కోట్ల కుపైగా కావాలి. ఈ నిధులు ఎక్కడి నుండి తెస్తారో చెప్పాలన్నారు. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా తనను రెండోసారి ప్రకటించినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, అమిత్ షా, జెపి నడ్డాకు బండి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల రుణం మర్చిపోలేనని అన్నారు. ‘మీరు వేసిన ఓటు వల్లే రాష్ట్ర అధ్యక్షుడిని చేసింది..తెలంగాణ ప్రజల పక్షాన పోరాటాలు చేయించి అండగా నిలిచేలా చేసింది… కష్టాల్లో ఉన్న పేదవాడికి భరోసా ఇచ్చింది.. కరీంనగర్ అభివృద్ధికి 12 వేల కోట్ల నిధులు తెచ్చా… మళ్లీ ఎంపిగా గెలిపిస్తే ప్రధానిని ఒప్పించి అధిక నిధులు తీసుకొచ్చి అభివృద్ధిలో కరీంనగర్ ఆదర్శంగా నిలిచేలా కృషి చేస్తా’ అని హామీ ఇచ్చారు.