హరీష్‌రావు దుబాయ్‌కి పోయినరోజే తెలుగు సినీ నిర్మాత కేదార్ శెలగం శెట్టి మృతిచెందారని కాంగ్రెస్ ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. హరీష్ రావుకు శవ రాజకీయాలు చేయడం ఇదేం కొత్త కాదని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేదార్ మృతిచెందడంపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఎంపి చామల డిమాండ్ చేశారు. సోమవారం గాంధీభవన్ లో ఆయన విలేకరుల సమావేశంలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసే హరీష్‌రావు దుబాయి పర్యటన వివరాలు ఎందుకు పెట్టలేదని ఆయన నిలదీశారు. హరీష్‌రావు స్నేహితుడి కూతురి పెళ్లి మార్చి 6వ తేదీన ఉంటే మరీ ఫిబ్రవరి 22న ఎందుకు దుబాయికి వెళ్లారో చెప్పాలని ఎంపి చామల ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ నేతలు బ్లాక్ మనీని వైట్‌గా మార్చుకోవడానికి దుబాయి వెళ్తున్నారని ఆయన ఆరోపించారు. అవినీతి సొమ్మును దుబాయిలో దాచుకోవడానికి హరీష్‌రావు వెళ్లారని ఆయన పేర్కొన్నారు.
హరీష్ డిక్షనరీలో అగ్గిపెట్టె, రాజీనామాలు మొదటి పదాలు అని ఎంపి చామల ఎద్దేవా వేశారు. సోషల్ మీడియాలో కాంగ్రెస్‌పై బిఆర్‌ఎస్ తప్పుడు ప్రచారాలు చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో మాజీ సిఎం కెసిఆర్ కోట్లు ఖర్చు పెట్టారని కానీ, అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శలు గుప్పించారు. బిఆర్‌ఎస్ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ఎస్‌ఎల్‌బిసి ఎప్పుడో పూర్తి చేసే వారని, నల్గొండ జిల్లాలో బిఆర్‌ఎస్ పార్టీకి నాయకులే లేరని ఆయన ఆరోపించారు. బిఆర్‌ఎస్ హయాంలో ఎక్కడైనా ప్రమాదాలు జరిగితే కెసిఆర్ వెళ్లారా..? అని ఆయన నిలదీశారు. కొండ గట్టులో 60 మందికి పైగా చనిపోతే కెసిఆర్ అక్కడకు వెళ్లారా..? అని ఆయన ప్రశ్నించారు. ప్రతిరోజు మధ్యాహ్నాం తొడలు కొట్టడానికి మాత్రమే బిఆర్‌ఎస్ నాయకులు బయటకు వస్తారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రతి పక్షాలు సహకరించాలని, కానీ, ఇలా తప్పుడు ప్రచారాలు చేయకూడదని ఎంపి చామల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీకి సిఎం వెళితే ప్రధాని సానుకూలంగా స్పందిస్తున్నారని కిషన్‌రెడ్డి, బండి సంజయ్ మాత్రం తెలంగాణకి ఏమీ తీసుకురాలేదని ఆయన ఆరోపించారు.