కిషన్‌రెడ్డి గులాబీ కళ్ల జోడు తీసేసి చూస్తే అన్ని సజావుగానే కనిపిస్తాయని భువనగిరి ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. దావోస్ పెట్టుబడుల సమీకరణకు సంబంధించి సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించడంపై ఎంపి చామల కిరణ్‌కుమార్ రెడ్డి మండిపడ్డారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కిషన్ రెడ్డి, మోడీ కేబినెట్లో మంత్రినా లేక కెసిఆర్ ఫాంహౌస్‌లో పాలేరువా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
పది సంవత్సరాల్లో చేయలేని అభివృద్ధిని రేవంత్ రెడ్డి మొదటి సంవత్సరంలోనే అభివృద్ధి చేసి చూపి స్తుంటే, వాళ్లు 9 సంవత్సరాల్లో తీసుకురాలేని పెట్టుబడులను తీసుకొచ్చి తెలంగాణ యువతకు ఉద్యోగాల కల్పన చేస్తుంటే చూసి ఓర్వలేక కడుపు మంటతో బిఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ నాయకులను ఈనో ప్యాకెట్స్ తాగమని చెప్పామని ఆయన గుర్తు చేశారు. దానికి తోడు కిషన్ రెడ్డి కూడా కెసిఆర్ కాలికి ముల్లుకుచ్చుకుంటే ఆయన నోటితో తీస్తా అనే విధంగా మాట్లాడుతున్నారని చామల మండిపడ్డారు.
కడుపు మంటతో ఏం మాట్లాడుతున్నారో…
కెటిఆర్ కడుపు మంటతో ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కెటిఆర్‌కు రాత్రి సమయంలో నిద్ర పట్టక రోజుకో ప్రెస్‌మీట్‌తో మీడియా ముందుకు వస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం విష ప్రచారం చేసేందుకే మీడియా సమావేశాల్లో మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. గతంలో సూట్ వేసుకున్న కెటిఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి జాకెట్ వేసుకున్న చూడలేకపో తున్నారని, అంత దరిద్రంగా ఆలోచిస్తున్నారని ఆయన అన్నారు. కడుపు మంటతో ఏం మాట్లాడుతున్నారో కూడా కెటిఆర్‌కు అర్థం కావడం లేదని, అందుకే కడుపు చల్లగా చేసుకొని పడుకోవాలని ఈనో ప్యాకెట్లు పంపినట్లు ఆయన వెల్లడించారు.