Friday, November 22, 2024

త్వరలోనే సిఎం రేవంత్ రెడ్డిని కలుస్తా:ఎంపి అర్వింద్

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ, జక్రాన్ పల్లి ఎయిర్ పోర్టు ఏర్పాటు అంశాలు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిపై త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చర్చిస్తానని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలల ఏర్పాటులో భాగంగా పైలెట్ ప్రాజెక్టు కోసం కొడంగల్, మధిర అసెంబ్లీ నియోజవర్గాలను ప్రభుత్వం ఎంపిక చేయడాన్ని ఆయన విమర్శించారు. శుక్రవారం ఢిల్లీలో అర్వింద్ మీడియాతో మాట్లాడుతూ పైలట్ ప్రాజెక్టుల విషయంలో మీ సొంత నియోజకవర్గాలను మీరు చూసుకుంటే మరి తెలంగాణను ఎవరు చూసుకోవాలని ప్రశ్నించారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలల ఏర్పాటులో మీ విజన్ ఏమిటో తెలియాలంటే రాష్ట్ర జాగ్రఫికల్ గా పైలట్ ప్రాజెక్టులను ఎంచుకోవాలే తప్ప సొంత నియోజకవర్గాల్లో ఎంపిక చేస్తే దానిని ప్రజాపాలన అనరని విమర్శించారు.

ఉమ్మడి ఏపీలో రాజశేఖర్ రెడ్డి హయాంలో తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ యూనివర్సిటీలను నెలకొల్పి రాయలసీమ యూనివర్సిటీకి అధిక నిధులు కేటాయించి విమర్శల పాలైన సంగతిని ఆయన గుర్తు చేశారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం పైలట్ ప్రాజెక్టు కింద ఆర్మూర్‌ను ఎంచుకుంటే ఉత్తర తెలంగాణకు అది సెంటర్ పాయింట్ అవుతుందని, దాని వల్ల ప్రభుత్వ ఉద్దేశం, లక్ష్యం ఏమిటో స్పష్టం అవుతుందన్నారు. పైలట్ ప్రాజెక్టు కింద రెండు యూనిట్లు ఎంచుకుంటే ఒకటి ఉత్తర తెలంగాణకు మరొకటి దక్షిణ తెలంగాణ నుంచి ఉండాలని లేదా నాలుగు ఎంచుకుంటే రాష్ట్రం నలుదిక్కులా ఏర్పాటు చేస్తే ఆ పథకాల వాస్తవ పరిస్థితులు తెలుస్తాయని అన్నారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలను పైలట్ ప్రాజెక్టు కింద ఆర్మూర్‌లో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి కోరుతున్న డిమాండ్ న్యాయమైనదేనని మద్దతు పలికారు. అప్పటి వరకు రాకేశ్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష విరమించుకోవాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News