మనతెలంగాణ/హైదరాబాద్‌ః రాష్ట్రంలో అన్నదాతలను మోసగించడంలో నాడు కెసిఆర్, నే డు రేవంత్‌రెడ్డి ఒకరికి మించి ఒకరు పోటీపడుతున్నారని రాష్ట్ర బిజెపి నేతలు విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దాదాపు వె య్యిమంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. రాష్ట్ర బిజెపి ఆధ్వర్యంలో సోమవారం ఇందిరాపార్కు వద్ద 24 గంటల పాటు జరిగే రైతు హామీల సాధన దీక్ష నిర్వహించా రు. బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి రే వంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ దీక్షను నిర్వహించ గా బిజెపి కర్ణాటక రాష్ట్ర సహా ఇన్‌చార్జి పొంగులేటి సుధాకర్‌రెడ్డి ప్రారంభించారు. ఎంపీలు ఈటల రాజేందర్, డీకే. అరుణ, రఘునందన్ రావు,
ధర్మపురి అర్వంద్, గోడెం నగేష్, కొం డా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, రామారావు పటేల్, ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, పాల్వాయి హరీష్ బాబు త దితరులు దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భం గా మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ఆనాడు వరంగల్ డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ సమక్షం లో అధికారంలోకి రాగానే ప్రతీ సంవత్సరం దాదాపు రూ.81 వేల కోట్లు ఖర్చు చేస్తామని రే వంత్ ఇచ్చిన హామీలను మర్చిపోయారా? అని ప్రశ్నించారు. లేదా మర్చిపోయినట్లు నటిస్తున్నారా? లేదంటే మొత్తానికే గ జినీలా మారిపోయారా చెప్పాలని వ్యంగ్యాస్త్రాలను సంధించా రు. రైతులకు మాత్రమే రుణమాఫీ చేసి, రెండవసారి రైతాంగాన్ని మోసం చేశారని తెలిపారు. చనిపోయిన రైతన్నల ఆత్మకు శాంతి చేకూరాలని బీజేపీ నేతలు కాసేపు మౌనం పాటించారు.
తెలంగాణను కెసిఆర్ నట్టేట ముంచితే – ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే దారిలో వెళ్తోంది –
గత బిఆర్‌ఎస్ పార్టీ హయాంలో కెసిఆర్ రైతులను మోసం చేస్తే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దారిలో నడుస్తోందని ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు.కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్‌లో ఒక్క సీట్లు రాలేదనే కక్షతో పేదల ఇళ్లు కూల్చేస్తోందని ఆరోపించారు. ప్రమాదవశాత్తు పంట నష్టం జరిగితే ఆదుకునే నాథుడే లేడని ఎద్దేవ చేశారు. కాంగ్రెస్ పార్టీ రైతులను నమ్మించి మోసం చేసిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే నోటీసు లేదని, నేరుగా కూలుస్తున్నారని మండిపడ్డారు. రైతు రుణ మాఫీ చేయలేదని, రైతు భరోసా లేదని, బోనస్ ముచ్చట కూడా లేదని దుయ్యబట్టారు. మహేశ్వర్‌రెడ్డి ఎల్పీ నేత అయినప్పటి నుంచి ఎన్నో స్కాములు, అవినీతిని బట్టబయలు చేశారని కొనియాడారు. రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంటే కెసిఆర్‌కు పట్టిన గతే రేవంత్‌రెడ్డికి పడుతుందని వ్యాఖ్యానించారు. మనమంతా ఇలాగే కలిసి కట్టుగా బలమైన ప్రతిపక్షంగా ఉంటే వచ్చే ఎన్నికల్లో అధికారం మనదే అవుతుందని- అరవింద్ పేర్కొన్నారు.
రుణ మాఫీ పూర్తిగా సాధ్యం కాదని తెలిసీ తప్పుడు హామీ ఇచ్చారు
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఎన్నో అడ్డదారులు, తప్పుడు హామీలు ఇచ్చిందని మల్కాజ్‌గిరి బిజెపి ఎంపి ఈటల రాజేందర్ అన్నారు. రుణమాఫీ పూర్తిగా చేయడం సాధ్యం కాదని తెలిసి కూడా కాంగ్రెస్ అగ్రనాయకత్వం నుంచి రాష్ట్ర నాయకత్వం వరకు తప్పుడు హామీ ఇచ్చిందని ఆరోపించారు. రైతులను దగా చేసి అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఇక ఆరు గ్యారంటీల్లో ఒక్క ఆర్టీసి మహిళలకు ఉచిత బస్సు పథకం తప్ప మిగిలిన హామీలన్నీ అమలు చేయకుండా తుంగలో తొక్కారని అన్నారు. ఆరు గ్యారంటీల్లో ఏ ఒక్కటీ అమలు చేసే సత్తా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సర్కార్‌కు లేదని ఎద్దేవా చేశారు. రైతులకు నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీ కార్యరూపం దాల్చలేదని మండిపడ్డారు. రుణమాఫీ విషయంలోనూ గత ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి మాట నిలబెట్టుకోలేదని గుర్తు చేశారు. రుణమాఫీ విషయంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్పినది చెప్పినట్లు అమలు చేయలేదని అన్నారు. రైతులకు ఇచ్చిన హామీల విషయంలో బిజెపి అండగా ఉండి పోరాడుతుందని అన్నారు.
కెసిఆర్ అవినీతిపై విచారణకు సిట్టింగ్ జడ్జి దొరకలేదా..?
కెసిఆర్ లక్ష కోట్ల అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి వాస్తవాలను బహిర్గతం చేస్తామని మెదక్ ఎంపీ రఘునందన్ రావు హెచ్చరించారు. ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సిట్టింగ్ జడ్జి దొరకలేదా? రిటైర్ అయిన జడ్జితో సిట్ వేశారని రఘునందన్‌రావు ఎద్దేవా చేశారు. రేవంత్ మూసీ సుందరీకరణ పేరిట కొత్త డ్రామా మొదలు పెట్టారని విమర్శించారు. కెసిఆర్ పదేళ్ల పాటు చాలా హామీలు ఇచ్చి రైతులను మోసం చేశారని, దీంతో ఎందరో అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన ఆరోపించారు. చనిపోయిన రైతు కుటుంబాలను కనీసం పరామర్శించని బీఆర్‌ఎస్ నేతలు ఈరోజు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని మండిపడ్డారు. పదేళ్లలో కెసిఆర్ ప్రభుత్వం ఏనాడు భూసార పరీక్షలు చేయలేదని చెప్పారు. తెలంగాణలో రైతుల సమస్యలు తీర్చడం బీజేపీకే సాధ్యమని అన్నారు.