Sunday, January 12, 2025

అసెంబ్లీకి వెళ్లని కెసిఆర్ ప్రతిపక్ష నాయకుడు ఎందుకయ్యారు:ఎంపి ధర్మపురి అర్వింద్

- Advertisement -
- Advertisement -

అసెంబ్లీకి వెళ్లని మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిపక్ష నాయకుడు ఎందుకు అయ్యారని నిజామాబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు. ముందు అసెంబ్లీకి వెళ్ళు, ఆ తర్వాత మైక్ గురించి మాట్లాడు అని కెసిఆర్‌కు సూచించారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలపై విరుచుకుపడ్డారు. రెండు పార్టీలు ప్రజలను నమ్మించి మోసం చేశాయని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు విస్మరిస్తే బిఆర్‌ఎస్‌కు పట్టిన గతే కాంగ్రెస్‌కు పడుతుందని విమర్శించారు. కెసిఆర్‌తో కేటీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్ నాలుగు స్తంభాల ఆట ఆడుతున్నారని వీరి నలుగురి మధ్య కేసిఆర్ నలిగిపోతున్నారని అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహం మీద రాజకీయం చేయడం దురదృష్టకరమని అన్నారు. ఈ పదేళ్లలో తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో ఎందుకు జీవో తేలేదో కేటీఆర్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్‌కు తెలంగాణ తల్లి విగ్రహం మీద కమిట్‌మెంట్ లేదని ధ్వజమెత్తారు.

వర్క్ చేయనోడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలా అవతారని ప్రశ్నించారు. కెటిఆర్ ఎవరు ఆయన ఆఫ్ట్రల్ ఎమ్మెల్యే మాత్రమే ఆయన గురించి చెప్పాల్సింది ఏముందని అన్నారు. బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన 38 మంది ఎమ్మెల్యేలలో కేటీఆర్ ఒక ఎమ్మెల్యే మాత్రమేనని, వర్క్ చేయనోడు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడని సెటైర్ వేశారు. కేటీఆర్, కవితకు కుక్క కూడా ఓటేయదని అర్వింద్ మరోసారి విమర్శలు గుప్పించారు. కవిత తిరిగి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటే ఏం చేయమంటారు? ఆమెను చూసి గజ గజ వణికిపోవాలా? అని ఎదురు ప్రశ్నించారు. పసుపు బోర్డు నిజామాబాద్ నుంచి మహారాష్ట్రకు తరలి వెళ్లిపోతుందని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విమానాశ్రయాలపై కనీసం దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్షం వల్లే ఎయిర్ పోర్టు పనులు ఆలస్యం అవుతున్నాయని విమర్శించారు. అదిలాబాద్, నిజామాబాద్‌కు గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం మంజూరు అయ్యిందని చెప్పారు. విమానాశ్రయం వచ్చే జక్రాన్ పల్లిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారని గుర్తు చేశారు.

తెలంగాణకు ఏడు నవోదయ విద్యాలయాలు కేటాయించిన ప్రధాని మోడీకి ధన్యవాదాలు చెప్పారు. ఇందులో రెండు నిజామాబాద్ పార్లమెంట్ కి కేటాయించారని, తొందర్లోనే నిజామాబాద్ కు కేంద్రీయ విద్యాలయం సైతం రానుందని తెలిపారు. ఇప్పటి వరకు కేవలం 25 శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందన్నారు. ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలో పర్యటించాలని, అప్పుడే వాస్తవాలు తెలుస్తాయని అన్నారు. హైదరాబాద్ ను నాశనం చేసి ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటున్నారని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. దీని వెనకున్న కుట్ర ఏమటని అన్నారు. గుజరాత్ మోడల్ గురించి మాట్లాడే అర్హత రెండు పార్టీలకు లేదని, హైడ్రా పేరుతో జెసిబిలతో బ్లాక్ మెయిల్ చేసి దోచుకుంటున్నారని ఆరోపణలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News