అబద్ధాలు ఆడడంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను మించిపోయారని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ వ్యాఖ్యానించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై ఇప్పటికే బీజేపీ ఛార్జిషీట్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రజాపాలన అంటూ జనాన్ని అబద్ధపు హామీలతో ప్రభుత్వం మభ్యపెడుతోందని సీఎం,
మంత్రులపై ఇటీవల వరుసగా విమర్శలు వస్తున్నాయి. సోమవారం డీకే అరుణ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడాది పాలనలో ఏం చేశారని విజయోత్సవాలు చేస్తున్నారంటూ నిలదీశారు. అన్ని వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసా,, తులం బంగారం, రూ.4 వేల పెన్షన్ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మహిళలకు రూ.2,500 సాయం చేస్తామని చెప్పి మాట తప్పారని నిలదీశారు.