రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావిశ్వాసాన్ని కోల్పోయిందని బిజెపి సీనియర్ నేత, మల్కాజ్‌గిరి ఎంపి ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఇంత త్వరగా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకోలేదని ఆయన అన్నారు. ఏడాది పాలనలోనే ప్రజలు విసిగిపోయారని, ఈ ప్రభుత్వాన్ని భరించే స్థితిలో లేరని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఏడాది కాంగ్రెస్ పాలనపై మల్కాజ్‌గిరి బిజెపి ఎంపి ఈటల రాజేందర్ ‘మన తెలంగాణ’ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వూలో తన అభిప్రాయాలను వెల్లడించారు. కూల్చివేతలు, భూములు లాక్కోవడమే అజెండాగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పని చేస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పేదలు, మధ్య తరగతి వర్గాల ప్రజలు ప్రభుత్వ తీరుతో తీవ్ర అసహనంతో ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు వ్యతిరేకంగా ఉండడం వల్ల అన్ని వర్గాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందని అన్నారు.
ఏడాది ముగిసేలోగానే గతంలో ఏ ప్రభుత్వానికి రాని ప్రజావ్యతిరేకత రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి రావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి తన భాష మార్చుకోవాలని హితవు పలికారు. భయపెట్టడం, ఎదురు దాడి చేయడం, డైవర్షన్ రాజకీయాలు చేయడం తప్ప ఈ ముఖ్యమంత్రికి ఇంకేమి చేతకాదని అన్నారు. ప్రతిపక్షాలపై ఇష్టానుసారంగా నోరుపారేసుకోవడం మానుకోవాలని, భాషను ఇకనైనా మార్చుకుని సిఎం హోదాకు తగ్గట్లుగా వ్యవహరించాలని హితవు పలికారు. ఆర్టీసి బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప మరే హామీ అమలు కాలేదని విమర్శించారు. రూ.4 వేల నెలవారీ పింఛన్ మొదలుకుని ఇచ్చిన హామీలన్నింటికి ఎగనామం పెట్టారని ఈటల ధ్వజమెత్తారు.
పేదల ఇళ్లు కూల్చే ప్రభుత్వం
ఈ ప్రభుత్వం పేదలకు ఇండ్లు కట్టే ప్రభుత్వం కాదని, పేదల ఇండ్లు కూల్చే ప్రభుత్వంగా పేరు తెచ్చుకుందని మండిపడ్డారు. పేదల ఇండ్లు కూల్చడం, భూములు లాక్కోవడం తప్ప మిగిలిన అజెండా ప్రభుత్వానికి లేదని చురకలంటించారు. ఎప్పుడు తమ ఇండ్లు కూల్చుతారో, భూములు లాక్కుంటారోననే భయంతో ప్రజలు కాలం నెట్టుకొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేద ప్రజలకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్న ఈ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని అన్నారు. భూములను గుంజుకోవడం తప్ప మరో పని లేకుండా పోయిందని అన్నారు. పేదల భూములు గుంజుకునే ప్రభుత్వంగా ముద్రపడింది తప్ప పేదల అవసరాలు తీర్చే ప్రభుత్వంగా పేరుతెచ్చుకోలేదని తెలిపారు. రైతులు, పేదలు ఎవరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో సంతోషంగా లేరని అన్నారు. ఏడాది పాలనలో నిజంగా ప్రజలకు ఈ ప్రభుత్వం చేసిందేంటో స్పష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
హైడ్రా పేరుతో ప్రజలను భయకంపితులను చేయడం తప్ప చేసిందేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. మూసీ నది ప్రక్షాళన పేరుతో పేదల ఇండ్లను కూలగొట్టడం ఏమిటని ప్రశ్నించారు. మూసి ప్రక్షాళన పేరుతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హడావుడి తప్ప మరేమీ లేదని వ్యాఖ్యానించారు. మూసీ ప్రక్షాళన విషయంలో ప్రజలంతా ముక్తకంఠంతో వ్యతిరేకించి నిలిచినా మొండిగా చేస్తున్నారని మండిపడ్డారు. ముచ్చర్లలో గత ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం 14 వేల ఎకరాల భూసేకరణ చేసిందని ఈటల తెలిపారు. అయితే ఆ రోజుల్లో ఫార్మాసిటీని వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే ఫార్మాసిటీ రద్దు చేసి ఆ భూములను ఆయా రైతులకు తిరిగి ఇస్తామని చెప్పిన సంగతిని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ హామీని అమలు చేయకుండా ఫోర్త్ సిటీ పేరుతో మరో 16 వేల ఎకరాలను సేకరించాలని ప్రయత్నించడం దారుణమని అన్నారు. రైతుల భూములను బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేశారని ఈటల ఆరోపించారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని అయితే లగచర్లలో రైతుల భూములను బలవంతంగా లాక్కోవాలని చూడడం సహించరానిదని అన్నారు.
హామీల అమలుకు రాష్ట్ర ఆదాయానికి పొంతనే లేదు
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరుతో ఇచ్చిన హామీల అమలు అయ్యే అవకాశం లేదని ఎంపి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఆదాయానికి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలుకు పొంతనే లేదన్నారు. వెనుకా ముందు చూడకుండా ఎడాపెడా ఇచ్చిన హామీలను అమలు చేయడం కాంగ్రెస్ సర్కార్ వల్ల సాధ్యం కాదని తేల్చి చెప్పారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసి బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ తప్ప ఏ ఒక్క హామీ అమలు కావడం లేదని అన్నారు. ప్రతి మహిళకు ప్రతినెల రూ.2500 ఇస్తామన్న హామీ, రూ.500కి వంట గ్యాస్ ఏమైందని, ఎంతమందికి ఇస్తున్నారని ఈటల నిలదీశారు. మహిళలకు ఇచ్చిన హామీలైతే అమలు జరగలేదని, అమలు చేయడం కూడా సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. రుణమాఫీ విషయంలో రైతులను ఈ ప్రభుత్వం ఘోరంగా మోసగించిందని అన్నారు.
రుణమాఫీ పేరుతో చేపట్టిన కార్యక్రమంలో కొందరికి మాత్రమే రుణ మాఫీ జరిగిందని, మిగిలిన చాలా మందికి రుణ మాఫీ జరగలేదని అన్నారు. ఇక రైతులు, కౌలు రైతులకు ఇచ్చిన హామీలైతే ఒక్కటీ అమలు కాలేదని అన్నారు. రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15 వేల రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు, వడ్లకు రూ.500 బోనస్ హామీల అమలుకు అతీగతి లేకుండా పోయాయని అన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం ఎంతమందికి అమలు చేస్తున్నారో చెప్పగలరా అని ప్రశ్నించారు. ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని ఇచ్చిన హామీ ముచ్చటే లేకుండా పోయిందని అన్నారు. ఏడాది పాలనలో చేసింది శూన్యమని అన్నారు. విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామన్న హామీ ఎంత వరకు వచ్చిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న ఆ వర్గం ఈ వర్గం అని చూడకుండా అన్ని వర్గాలను కాంగ్రెస్ పార్టీ దారుణంగా మోసం చేసిందని అన్నారు. హామీలు అమలు చేయడం సాధ్యం కాదని తెలిసి కూడా ఓట్ల కోసం విస్త్రత ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారని ఈటల ధ్వజమెత్తారు.