ఉద్యోగాల భర్తీ జరుగుతుందని ఆశపడ్డ నిరుద్యోగులకు నిరాశే మిగిలిందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తమ డిమాండ్లపై రౌండ్ టెంపుల్ సమావేశం సోమాజిగూడలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రెండు లక్షల ఉద్యోగాల భర్తీ దేవుడు ఎరుగు, ఇప్పుడు జరుగుతున్న ఉద్యోగాల పరీక్షకు గ్యాప్ ఇవ్వమని అడిగితే గొడ్లను కొట్టినట్టు కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోచింగ్ సెంటర్లు డబ్బులు ఇస్తే నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారని సిఎం అభాండాలు వేస్తుంటే కంచె చేను మేసినట్టు ఉందని ఆరోపించారు. అహంకారంతో వ్యవహరిస్తే కెసిఆర్‌కు ఏ గతి పట్టిందో మీకు కూడా అదే పడుతుంది హెచ్చరిస్తూ ఆ సోయితో పనిచేయాలని సూచించారు. బేషజాలకు పోకుండా వారు అడుగుతున్న డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించాలని ఈటల రాజేందర్ కోరారు.
రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారని అన్నారు. వీరంతా ఉన్నత చదువులు చదివిన వారని తెలిపారు. వీరికి ఏజెన్సీల ద్వారా జీతాలు అందిస్తున్నారని, ఈఎస్‌ఐ, పిఎఫ్, జిఎస్‌టి పోయిన తర్వాత రూ.9 వేలు కూడా రావడం లేదని తెలిపారు. వీరు అడుగుతున్న డిమాండ్లు పెద్దవి కావని అన్నారు. డిపార్టుమెంట్ నేరుగా జీతాలు ఇవ్వాలనీ కోరుతున్నారని అన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కల్పించాలని కోరారు. నెల వారీగా జీతాలు ఇవ్వాలని, ఉద్యోగం తీసివేయకుండా భద్రత కల్పించాలని ఎంపీ పేర్కొన్నారు. ఈఎస్‌ఐ, పిఎఫ్, హెల్త్ కార్డులు కల్పించాలని కోరారు. ప్రభుత్వం స్పందించాలని ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.