రాహుల్‌కు కాంగ్రెస్ ఎంపి సూచన
పనాజీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రను నిలిపివేసి ఎన్నికలు జరగనున్న హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌పై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ ఎంపి, గోవా మాజీ ముఖ్యమంత్రి ఫ్రాన్సిస్కో సర్దిన్హా సూచించారు. ఎఐసిసి అధ్యక్ష ఎన్నికల పోలింగ్ సందర్భంగా సోమవారం పానాజీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బిజెపిని ఓడించగల సత్తా ఒక్క కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి భారత్ జోడో యాత్ర చాలా ముఖ్యమైనదని, కింది స్థాయిలో పార్టీ బలోపేతం కావాలనే తాము కోరుకుంటున్నామని ఆయన చెప్పారు. రాహుల్ గాంధీ తన కర్తవ్యాన్ని అద్భుతంగా నిర్వర్తిస్తున్నారని, అయితే ఇప్పుడు రాహుల్ తన యాత్రను తక్షణమే నిలిపివేసి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలకు వెళ్లాలని తాను కోరుతున్నానని ఆయన తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఒకే దఫాలో నవంబర్ 12న జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 8న వెలువడతాయి. కాగా..గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ఇంకా ప్రకటించవలసి ఉంది. ఇదిలా ఉండగా…సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో రాహుల్ ప్రారంభించిన భారత్ జోడో యాత్ర ఇప్పటికే తమిళనాడు, కేరళ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌ను దాటింది. 150 రోజులలో 3,570 కిలోమీటర్లు సాగే ఈ యాత్ర జమ్మూ కశ్మీరులో ముగియనున్నది.