అమరావతి ఎంపి నవనీత్‌కౌర్‌కు బాంబే హైకోర్టు షాక్
నకిలీ ధ్రువపత్రాలు సమర్పించినందుకు రూ.2 లక్షల జరిమానా
ప్రమాదంలో పడిన నటి లోక్‌సభ సభ్యత్వం
ముంబయి: మహారాష్ట్రలోని అమరావతి లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన సినీ నటి నవనీత్ కౌర్ రాణాకు బాంబే హైకోర్టు షాక్ ఇచ్చింది. ఎన్నికల్లో తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించినందుకు ఆమెకు రూ.2 లక్షలు జరిమానా విధించింది. అంతేకాదు ఆరువారాల్లోగా ఆ సర్టిఫికెట్‌ను సరెండర్ చేయాలని ఆమెను ఆదేశించింది. నవనీత్‌కౌర్ ఎస్సి సామాజిక వర్గానికి చెందిన వారు కాదని, ఫోర్జరీ ధ్రువీకరణ పత్రంతో ఆమె పోటీ చేసి గెలుపొందారని ఆరోపిస్తూ మాజీ ఎంపి, శివసేన నేత ఆనందరావు అదసూల్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం మంగళవారం తీర్పు ఇచ్చింది. అమరావతినుంచి స్వతంత్ర అభ్యర్థిగాపోటీ చేసిన నవనీత్ కౌర్ తొలిసారి ఎంపిగా ఎన్నికైన విషయం తెలిసిందే. బాంబే హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో ఆమె లోక్‌సభ సభ్యత్వం ప్రమాదంలో పడినట్లైంది.
శివసేన ఎంపి అరవింద్ సావంత్ లోక్‌సభ లాబీల్లో తనపై బెదిరింపులకు పాల్పడ్డ్డారంటూ గత మార్చిలో నవనీత్ కౌర్ ఆరోపించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు పంపుతామని హెచ్చరించారని తెలిపింది. తనపై యాసిడ్ దాడి చేస్తామంటూ ఫోన్‌కాల్స్‌తో పాటు శివసేన లెటర్ హెడ్‌తో లేఖలు కూడా వస్తున్నాయంటూ నవనీత్ కౌర్ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ కూడా రాశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని అమరావతి ఎస్సి రిజర్వ్డ్ స్థానంనుంచి నవనీత్ కౌర్ శివసేన అభ్యర్థి ఆనందరావు అదసూల్పైనే పోటీ చేసి గెలుపొందారు. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజకీయ అరంగేట్రం చేసిన కౌర్ ఎస్సిపి తరఫున బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2019 లోక్‌సభ ఎన్నికల్లో అమరావతి లోక్‌సభ స్థానంనుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. నవనీత్ కౌర్ పలు తెలుగు చిత్రాలతో పాటుగా కన్నడ, తమిళం,మలయాళీ, మరాఠీ చిత్రాల్లో కూడా నటించారు.