మన తెలంగాణ/హైదరాబాద్: మాజీ ప్రధాన మంత్రి పివి నరసింహారావు ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి…అజాత శత్రువు.. సంస్కరణల ఆరాధ్యుడని టిఆర్‌ఎస్ పార్టీమెంటరీ పార్టీ నాయకుడు కె. కేశవరావు అన్నారు. ప్రధానంగా దేశంలోని పలు కీలక రంగాల్లో నూతన సంస్కరణలను ప్రవేశపెట్టి భారతదేశ ప్రతిష్టను ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావుడని ప్రశంసించారు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందన్నారు. మేధావిగా, సంఘ సంస్కర్తగా, బహుభాషా కోవిదుడుగా ప్రపంచానికి పరిచయం లేని వ్యక్తి పివి అని కొనియాడారు. ముఖ్యంగా సంస్కరణ వాదిగా ఆయనకు పేరుందన్నారు. ముందుగా తన భూములను దానం చేసి భూసంస్కరణలు అధ్యుడుగా ముందుకు సాగారన్నారు. దేశంలో గురుకుల పాఠశాల వ్యవస్థను తీసుకోవచ్చిందే పివి నరసింహారావు అని అన్నారు. దివాళా స్థితిలో ఉన్న భారత ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచిన ఘనత కూడా పివిదేనని ఆయన పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో జరిగిన పివి వర్ధింతి కార్యక్రమంలో కెకె పాల్గొన్నారు. ఆయనతో పాటు రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు నిరంజన్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, గంగుల కమలాకర్, ఎంపిలు రంజిత్ రెడ్డి, వెంకటేష్ నేత, మన్నే శ్రీనివాస్ రెడ్డి, సురేశ్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, ఎంఎల్‌సి బండ ప్రకాష్ ముదిరాజ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పివిచిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళుల అర్పించారు.
అనంతరం కెకె మాట్లాడుతూ.. పివి ఆలోచనలను అమలు చేయడంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అందరికంటే ముందువరసలో ఉంటారన్నారు. పివికి భారత రత్న ఇవ్వాలని మొదటి సారిగా డిమాండ్ చేసింది కూడా కెసిఆరే అని వ్యాఖ్యానించారు. అలాగే హైదరాబాద్ యూనివర్సిటీకి పివి పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని సిఎం కెసిఆర్ కోరిన విషయాన్ని ఈ సందర్భంగా కెకె గుర్తు చేశారు. పివి చేసిన సేవలను గుర్తించే టిఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పివి విగ్రహాలు పెడుతున్నామన్నారు. పివికి భారతరత్న ఇవ్వడం అత్యంత చాలా ముఖ్యమైనదన్నారు. అలాంటి వ్యక్తికి సొంత పార్టీ(కాంగ్రెస్)లో చివరిరోజుల్లో తగిన గౌరవం దక్కలేదని కెకె ఆవేదన వ్యక్తం చేశారు. పివి జయంతి, వర్ధంతిని గతంలో ఎవరు పట్టించుకోలేదన్నారు. ఆయన చేసినసేవలను ముందు తరాల వారికి అందించాలన్న లక్షంతోనే సిఎం కెసిఆర్ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలను చేపడుతున్నారన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందిన వారైనప్పటికి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ఆద్యుడు కాబట్టి వేడుకలను ఘనంగా నిర్వహించామన్నారు.
MP Keshava Rao Pays tribute PV Narasimha Rao in Delhi