హైదరాబాద్: కేంద్ర బడ్జెట్-2022 పూర్తిగా నిరాశపర్చిందని టిఆర్ఎస్ ఎంపి కె కేశవరావు అన్నారు. మంగళవారం ఢిల్లీలో ఎంపి కెకె మీడియాతో మాట్లాడుతూ.. ”ఉపాధి హామీ పథకానికి 25శాతం నిధులు తగ్గించారు. కరోనా సమయంలోనూ నిధుల్లో కోత పెట్టారు. ఆరోగ్య రంగాన్ని గాలికి వదిలేశారు. క్రిప్టో కరెన్సీపై క్లారిటీ లేదు. 30శాతం పన్ను విధించారంటే లీగల్ చేస్తారా?. తెలంగాణ నుంచి కొన్ని పథకాలను కాపీ చేసి ఈ బడ్జెట్లో పొందుపరిచారు. ఎక్కడైనా రిజిస్ట్రేషన్ అనేది తెలంగాణ నుంచి కాపీ చేసిందే. బడ్జెట్ దశ దిశ లేకుండా ఉంది. కార్పొరేట్ సెక్టార్ కే కొంత ఊరట ఇచ్చారు. వైద్య రంగానికి బూస్ట్ ఇచ్చిన దాఖలాలే లేవు. ఈ బడ్జెట్ పేదలను విస్మరించిన బడ్జెట్. పట్టణ పేదలు నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంపై ఎలాంటి ప్రస్తావన లేదు.ఇది వ్యవసాయ, నిరుపేద పక్షపాత బడ్జెట్ అని ప్రధాని అంటున్నారు. కానీ వ్యవసాయానికి అతి స్వల్పంగా కేటాయింపులు పెంచారు తప్ప ఇంకేమీ లేదు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల కోసం ఎలాంటి కొత్త పథకాలు లేవు. మెడికల్ కాలేజీల సంగతి వదిలేయండి, విభజన చట్టంలో పెట్టిన ఐఐఎం ఇవ్వాలి కదా?. జల వివాదాల పరిష్కారానికి ఏర్పాటు చేయాల్సిన ట్రిబ్యునల్ సంగతి ఏమైంది?. మౌలిక వసతుల కల్పన కోసం కేటాయించిన బడ్జెట్లో పెద్దగా తేడా ఏమీ లేదు. మసిపూసి మారేడుకాయ తరహాలో ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. తెలంగాణ విషయంలో పూర్తి వివక్షను ప్రదర్శిస్తున్నారు. శత్రువులా చూస్తున్నారు. లాభాల్లో ఉన్న ఎల్ఐసి అనే సంస్థను ప్రైవేటీకరణ చేస్తున్నారు.. ఇది దారుణం. విద్యారంగంలో 18% కేటాయింపులు పెంచారు. అదొక్కటి ఫరవాలేదు. మూలధన వ్యయం పెంచారు. తెలంగాణ ఈ విషయంలో ఎప్పుడూ ముందే ఉంది. దీని వల్ల తెలంగాణకు పెద్దగా ఉపయోగం లేదు” అని అన్నారు.
MP Keshava Rao Reacts on Union Budget 2022