హైదరాబాద్ : సగం నెల గడిచిపోయినా ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటి వరకు జీతాలు, పెన్షనర్లకు పెన్షన్లు ఇవ్వకపోవడం బాధాకరమని పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ఇప్పటికైనా జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే రెండు నెలలైనా 1వ తేదీన జాతాలు చెల్లించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులనుపట్టించుకోవడం మానేసిందని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగులను చిన్న చూపు చూడడం సరైన పద్దతి కాదని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మన రాష్ట్ర ఉద్యోగులు జీతాలు ఎప్పుడు వస్తాయో నని ఎదురు చూడాల్సిన పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొందని ఆయన పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటో తేదీనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు జమ చేసేదని, వారికి పీఆర్‌సి, డిఎ, సమయానికి ఇచ్చేదని గుర్తు చేశారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం నేడు ప్రభుత్వ ఉద్యోగులను రోడ్డున పడేసిందన్నారు.నెలనెలా కట్టాల్సిన ఈఎంఐలు, చెల్లింపులు, లోన్ల కోసం ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
జాష్యం కారణంగా కొందరు వడ్డీలు కూడా చెల్లించాల్సి వస్తోందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారన్నారు. చివరకు పాల బిల్లులు, కిరాణా బిల్లుల విషయంలో కూడా మాట పడాల్సి వస్తున్నదని ప్రభుత్వ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని కోమటి రెడ్డి పేర్కొన్నారు. ఇప్పుడే ఇలాఉంటే రానురాను నెలనెలా జీతాలు ఇస్తారో లేదోనన్న సంశయం అందరిలోనూ నెలకొందన్నారు. విశాంత్ర ఉద్యోగులు మరింత ఎక్కువ ఆందోళన చెందుతున్నారని తెలిపారు. 18 నెలల నుంచి ఉద్యోగులకు ఇవ్వాల్సిన పిఆర్‌సి పెండింగ్ లో ఉందన్నారు. డిఎ, ఎరియర్స్ ఇప్పటి వరకు ఇవ్వలేదని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్కటో తారీఖున జీతాలు చెల్లిస్తుందని వెంకట్ రెడ్డి చెప్పారు . వారికి రావాల్సిన బకాయిలు, పిఆర్‌సి చెల్లిస్తామని, కాంగ్రెస్ పాలిత హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్న విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా సిపిఎస్ ను రద్దు చేస్తూ పాత పెన్షన్ పథకాన్ని (ఒపిఎస్) అమలుపరుస్తామని కాంగ్రెస్ పార్టీ తరుపున హామీ ఇస్తున్నామని ఆయన తన బహిరంగ లేఖలో పేర్కొన్నారు.