Monday, December 23, 2024

చెరుకు సుధాకర్‌ కు కోమటిరెడ్డి బెదిరింపులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోజుకో రకంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా సొంత పార్టీ నేత, తెలంగాణ ఉద్యమకారుడు చెరుకు సుధాకర్‌ను చంపుతానంటూ బెదిరింపులకు దిగడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనమైంది. చెరుకు సుధాకర్ కొడుకు చెరుకు సుధాకర్ కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా ఫోన్ చేసి అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. ప్రజల్లో తిరిగినా తనపై స్టేట్ మెంట్ ఇచ్చినా చెరుకు సుధాకర్‌ను చంపడంతో పాటు ఆయన కొడుకు హాస్పటల్ సైతం ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. తనపై ప్రకటనలు ఇస్తే ఊరుకోబోమని చంపేయడం ఖాయం అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్‌లో హెచ్చరించారు. చెరుకు సుధాకర్‌ను చంపేందుకు 100 కార్లలో తన అనుచరులు, అభిమానులు తిరుగుతున్నారని, వారి అభిమానాన్ని తాను ఆపలేనని హెచ్చరించారు.

ఇందుకు సంబంధించిన ఆడియో క్లిప్పింగ్ కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో జిల్లా రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ ఉద్యమకారుడు, రాజకీయ నేత అయిన చెరుకు సుధాకర్‌పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసభ్య పదజాలం ఉపయోగించడంపై యావత్ తెలంగాణ ఉద్యమకారులు వెంకట్ రెడ్డి తీరును తప్పుపట్టారు. అంతేగాక సదరు ఆడియో క్లిప్పింగులను, కోమటిరెడ్డి వ్యవహార శైలిని ఎఐసిసి దృష్టికి తీసుకెళ్లారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో కొరకరాని కొయ్యగా మారాడు. దాదాపు ఉమ్మడి జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోనూ తన మాట నెగ్గించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలోనే నల్గొండ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో తాను చెప్పిన వారికే టికెట్ ఇవ్వాలంటూ తరచూ మెలికలు పెడుతుంటాడు.

అందులో భాగంగానే ఇప్పటివరకు నల్గొండ, నకిరేకల్, భువనగిరి, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన అభ్యర్థులకు సీట్లు ఇవ్వాలంటూ ఒత్తిడి చేసి వచ్చేవారు. కానీ ఇటీవల రాజ కీయ సమీకరణాలు మారడంతో పార్టీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. అయితే మునుగోడు ఉపఎన్నిక ముందు వరకు తెలంగాణ ఉద్యమకారుడు చెరుకు సుధాకర్ తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే ఉపఎన్నిక సమయంలో చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం అటు నియోజకవర్గంలో ఇటు పార్టీలో చెరుకు సుధాకర్‌కు ప్రాధాన్యత పెరుగుతుండడంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కసు వెళ్లగక్కారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నకిరేకల్ నియోజకవర్గంలో చెరుకు సుధాకర్ బలపడితే తన అభ్యర్థికి టికెట్ ఇప్పించుకోవడం కష్టం అవుతుందని, ఎలాగైనా చెరుకు సుధాకర్‌కు చెక్ పెట్టేందుకు గత కొంతకాలంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.

అయితే చెరుకు సుధాకర్‌కు ప్రజల్లో మంచి గుర్తింపు ఉండడంతో ఆ ఎత్తులు పనిచేయడం లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం రోజురోజుకీ వివాదాస్పదంగా మారుతుంది. పార్టీ అధిష్టానం పైన, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డిపైన ఇప్పటికే పలు మార్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయినా పార్టీ అధిష్టానం ఏనాడు చర్యలు తీసుకుంది లేదు. ఒకానొక దశలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ పైన డబ్బులకు టికెట్లు అమ్ముకుంటున్నారంటూ మండిపడ్డారు. తాజాగా కాంగ్రెస్ నేత చెరుకు సుధాకర్‌పై అసభ్య పదజాలం ఉపయోగించి పార్టీ ప్రతిష్టను ఇబ్బందుల్లో పడేశారు. అంతకు ముందు మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే బిజెపి నుండి పోటీ చేసిన తన సోదరుడు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సపోర్ట్ చేయాలంటూ పలువురు కాంగ్రెస్ కార్యకర్తలకు ఫోన్ చేసిన సంగతి విదితమే. దీంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News