హైదరాబాద్: ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు మెట్రో రైలు పొడిగించాలని కోరుతూ భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సిఎం కెసిఆర్‌కు లేఖ రాశారు. ఇటీవల తొలి లేఖలో డిఎస్సీ నోటిఫిషన్ విడుదల చేయాలని, రెండో లేఖలో రైతుబంధు వానాకాలం సీజన్ పెండింగ్ డబ్బులను రైతులకు అందించాలని కోరగా, మూడో లేఖలో ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రో రైల్‌ను పొడిగించాలని ఆయన సిఎంకు రాసిన లేఖలో కోరారు. హయత్‌నగర్, నల్లగొండ మార్గం వేగంగా విస్తరిస్తోందని,
నిత్యం వేలాది మంది ప్రజలు హయత్‌నగర్ నుంచి ఎల్బీనగర్ వరకు వెళ్లి, అక్కడి నుంచి మెట్రోకు వెళుతున్నారని, ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా హయత్‌నగర్ వరకు మెట్రో పొడిగించాలని ఎంపి సిఎం కెసిఆర్‌ను కోరారు. హైద్రాబాద్ టు విజయవాడ జాతీయ రహదారి 65ను 6 లేన్లుగా కేంద్రం మారుస్తుందని, రానున్న రోజుల్లో వాహనాల రద్దీ మరింత పెరుగుతుందని, అప్పుడు ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్, ఆ చుట్టుపక్కల ప్రజల ప్రయాణం మరింత దుర్భరంగా మారే అవకాశం ఉంటుందని ఆయన ఆ లేఖలో తెలిపారు. మెట్రో విస్తరణ జరిగితే ప్రయాణికులు సొంత వాహనాల వాడకం తగ్గించే ఛాన్స్ ఉందని ఆయన పేర్కొన్నారు.