లోక్‌సభలో ప్రస్తావించిన భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : భువనగిరి కోట అభివృద్ధికి నిధులు కేటాయించాలని, కేబుల్ కార్ (రోప్‌వే) నిర్మాణం చేపట్టాలని రూల్ 377 క్రింద లోక్‌సభలో భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రస్తావించారు. ఎంతో గొప్ప చరిత్ర కలిగిన భువనగిరి కోటపై కేబుల్ కార్(రోప్‌వే) నిర్మించడంతో పాటు కోట అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించాలని పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. భువనగిరి కోట నిర్మాణం అద్భుతంగా ఉండటంతో పాటు పర్యాటక ప్రియులను, ట్రెక్కింగ్ వంటి సాహస క్రీడలు ఆడే వారికి వీలుగా ఉంటుందని తెలిపారు.
పైగా ఈ కోటకు రోడ్డు, రైలు ద్వారా రవాణా సౌకర్యం కలిగి ఉండి.. రాష్ట్ర రాజధానికి కేవలం 48 కిలోమీటర్ల దూరంలో ఉందని వివరించారు. పర్యాటకుల సౌకర్యార్థం కోటకు కేబుల్ కార్ (రోప్‌వే) వేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిందని తెలిపారు. టెండర్లు పిలవడం వాటిని రద్దు చేయడం జరిగిందన్నారు. 2016లో రెండవసారి టెండరుల పిలిచి ఎలాంటి కారణాలు లేకుండా ప్రభుత్వం టెండర్లను రద్దు చేసిందని వివరించారు. రాష్ట్ర సర్కార్ కోట అభివృద్ధిపై అలసత్వం వహిస్తుందని వెల్లడించారు. దేశంలోని సంస్కృతి వారసత్వ సంపదను రక్షించడానికి ప్రధాని మోడీ కంకణం కట్టుకుంటే భువనగిరి కోట అభివృద్ధికి కావాల్సిన నిధులను కేంద్రం మంజూరు చేయాలని కోరారు.