సిద్దిపేట : సిఎం కెసిఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్దిలో దూసుకుపోతుంటే చూసి ఓర్వలేకనే కేంద్రంలో ఉన్న బిజెపి సర్కార్ రాష్ట్రానికి రావల్సిన నిధుల్లో కోత విధిస్తుందని బిఆర్‌ఎస్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి మండి పడ్డారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల పట్ల అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిర్వహించిన మహాదర్నాలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాల సిఎంలు సైతం వారి వారి రాష్ట్రాలలో అమలు చేసుకుంటున్నారన్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణను అడ్డు కట్ట వేయడానికే కేంద్ర ప్రభుత్వం అనేక కుట్రలు పన్నుతుందన్నారు.
సిఎం కెసిఆర్ రైతు బిడ్డ కాబట్టే వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేసి రైతులకు అన్ని విదాలుగా సహాయ సహకారాలు అందిస్తూ అండగా నిలుస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు నిర్మించి పంట పోలాలకు కాళేశ్వరం జలాలు అందించడంతో పాటు సకాలంలో ఎరువులను అందించడం , పంట పెట్టుబడి సాయం, రైతు భీమా, రైతుబంధు లాంటి అనేక పథకాలను అందిస్తున్న ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందన్నారు.బిజెపి ఎన్ని కుట్రలు పన్నినా బిఆర్‌ఎస్ కు ఒరిగేది ఏమిలేదన్నారు. రాష్ట్రానికి రక్షణ కవచంగా సిఎం కెసిఆర్ నిలిచారన్నారు. రాష్ట్రంలో ఉన్న నలుగురు ఎంపీలు ఏ రోజు తెలంగాణకు రావల్సిన హక్కులపై, ప్రజా సమస్యలపై పార్లమెంట్‌లో గళం విప్పలేదన్నారు. పేరుకే ఎంపీలు తప్ప తెలంగాణ కోసం ఏమి చేశారని ప్రశ్నించారు. సిఎం కెసిఆర్ , హరీశ్‌రావులపై పోటి చేస్తాననే గోప్పలు చెప్పుకునే ఎంఎల్ఎ రఘునందన్‌రావు దమ్ముంటే సిద్దిపేటలో ఉన్న ఏ ఒక్క కౌన్సిలర్ పై పోటి చేసి గెలిచి చూపించాలని సవాల్ విసిరారు.
కేంద్రం నుండి ఏ ఒక్క రూపాయి తేని రఘునందన్‌రావు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలకు ముందు వరుసలో ఉండి ప్రారంభోత్సవాలు చేస్తూ తిరిగి బిఆర్‌ఎస్ సర్కార్‌పైనే విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా బిజేపోళ్లు విమర్శులు చేయడం మానుకొని రాష్ట్ర అభివృద్ది కోసం కేంద్ర సర్కార్ నుండి నిధులు తీసుకురావాలన్నారు. రైతుల కోసం కల్లాలు కట్టిస్తే ఆ డబ్బులు తిరిగి వాపసు ఇవ్వమని అడగడం సిగ్గు చేటన్నారు. అంబాని, అదాని లాంటి బడా వ్యాపార వేత్తలకు అండగా నిలుస్తున్న కేంద్ర సర్కార్‌కు రానున్న రోజుల్లో రైతులు, ప్రజలు తగిన రీతిలో బుద్ది చెబుతారన్నారు. జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజాశర్మ, ఎమ్మెల్సీలు ఫారుఖ్ హుస్సెన్, యాదవరెడ్డిలు మాట్లాడుతూ గతంలో మోడీ సర్కార్ పంజాబ్ రైతులను ఇబ్బందులకు గురి చేస్తే రైతుల తిరుగుబాటు ఆ సర్కార్‌కు తప్ప లేదన్నారు.
బిఆర్‌ఎస్ రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తుందన్నారు. దేశ ప్రజల, రైతుల కోసమే బిఆర్‌ఎస్ పార్టీ దేశ వ్యాప్తంగా వ్యాప్తి చెందుతుందన్నారు. ఈ మహా ధర్నాలో ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతు సంఘాల నాయకులు కడవేర్గు రాజనర్సు, వేలేటి రాదాకృష్ణ శర్మ, మారెడ్డి రవీందర్ రెడ్డి, మచ్చ వేణుగోపాల్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.