మన తెలంగాణ/ హైదరాబాద్: మునుగోడు ఓటమితో కుంగిపోయే పార్టీ బిజెపి కాదని, గెలిస్తే పొంగిపోమని బిజెపి రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు. ఓటమి కారణాలను సమీక్షించి, బలహీనంగా ఉన్నచోట్ల బలపడటానికి కృషి చేస్తామన్నారు. ఆదివారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో లక్ష్మణ్ మాట్లాడారు.. యావత్తు ప్రభుత్వాన్ని మునుగోడుకు తీసుకొచ్చిన ఘనత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికే దక్కుతుందన్నారు. మునుగోడులో ఎంతమంది మంత్రులు, ఎంఎల్‌ఎలు తిష్ట వేసినా బిజెపి ఓటు బ్యాంక్‌ను మాత్రం తగ్గించలేకపోయారని అన్నారు.
దేశవ్యాప్తంగా బిజెపిని ఎదుర్కొనడానికి కాంగ్రెస్, వామపక్షాలు ఏకమైనా ఓడించలేకపోతున్నారని అన్నారు. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాలలో ఏడు స్థానాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బిజెపి ఆరు స్థానాల్లో పోటీ చేసి నాలుగు చోట్ల గెలుపొందిందని అన్నారు. గతంలో మూడు స్థానాలకు గాను అదనంగా మరోసీటు బిజెపి గెలిచిందన్నారు. కాంగ్రెస్ మూడు సిట్టింగ్ స్థానాలను కోల్పోయిందని చెప్పారు. మునుగోడులో కాంగ్రెస్ కనీనం డిపాజిట్ సాధించలేక పోయిందని, అలాగే దేశవ్యాపంగా మూడు సిట్టింగ్ స్థానాలను కోల్పోయిందన్నారు. కాంగ్రెస్ పతనానికి ఈ ఎన్నికలే నిదర్శనమన్నారు.
MP Laxman About Munugode Bypoll Result