Saturday, October 5, 2024

అధికారిక కార్యక్రమమా..కాంగ్రెస్ పార్టీ సొంత వేడుకా..?:ఎంపి లక్ష్మణ్

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు కాంగ్రెస్ పార్టీ సొంత వేడుకలా ఉందని బిజెపి రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో 369 మంది ప్రాణాలను ఆ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం బలిగొందని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఉద్యమానికి కమలం పార్టీ మద్దతు తెలిపి పోరాటం చేసిందని గుర్తు చేశారు. హైదరాబాద్‌లోని నాంపల్లి రాష్ట్ర బిజెపి కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలనే కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తోందని ఆరోపించారు. తెలంగాణ ఉత్సవాలను కాంగ్రెస్ పార్టీ వేడుకగా జరుపుకోవడం సరైంది కాదని అన్నారు. తెలంగాణ బిల్లుకు మద్దతు ఇస్తామని ఆనాడు జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ హామీ ఇచ్చారని, సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీ లోక్‌సభ, రాజ్యసభలో తెలంగాణ కోసం గళమెత్తారని గుర్తు చేశారు.

1200 మంది విద్యార్థుల బలిదానాల మీద తెలంగాణ ఏర్పడిందని తెలిపారు. రాష్ట్ర ఉద్యమ సమయంలో సోనియా గాంధీని రేవంత్‌రెడ్డి బలి దేవత అని వ్యాఖ్యానించి ఇప్పుడు సిఎం అయ్యాక బలి దేవతను ఎలా ఆరాధిస్తున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చరిత్రను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. కెసిఆర్ ప్రభుత్వం కవులు కళాకారులు, ఉద్యమకారులను విస్మరించిందని లక్ష్మణ్ ఆరోపించారు. తెలంగాణ చిన్నమ్మ సుష్మాస్వరాజ్‌ను విస్మరించడం దారుణమని లక్ష్మణ్ మండిపడ్డారు. ఇప్పుడు రాష్ట్ర అవతరణ వేడుకల్లో బిజెపిని భాగస్వామ్యం చేయకపోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సోనియాగాంధీ ఇచ్చిందని రేవంత్‌రెడ్డి చెప్పడం సరైంది కాదని, సకల జనులు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నారని గుర్తు చేశారు. కవులు, కళాకారులు, ఉద్యమకారులకు న్యాయం చేయకపోతే ముఖ్యమంత్రికి ఈ ఐదేళ్లు కష్టమేనని ఉంటాయని హెచ్చరిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి నాంది పలికింది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) అని, విద్యార్థుల బలిదానాలతోనే తెలంగాణ వచ్చిందని లక్షణ్ పేర్కొన్నారు.

ప్రత్యేక తెలంగాణ కోసం తీర్మానం చేసిన పార్టీ బీజేపీ అని, బీజేపీ తెలంగాణ కోసం ఉద్యమం చేసిందని, పార్లమెంట్‌లో గళం విప్పిందన్నారు. కాంగ్రెస్ పార్టీ దిక్కుతోచని పరిస్థితిలో ద్వందనీతిని అవలంభించిందని ఆయన విమర్శించారు. ఉద్యమకారులను విస్మరించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని అనుభవిస్తుందని అన్నారు. ఇటువంటి పరిస్థితిలో ఏ విధంగా సలహాదారుగా ఉన్నారో కోదండ రామ్ ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో బిజెపిని భాగస్వామ్యం చేయకపోవడం, ఆ విషయాన్ని కోదండ రామ్ ప్రశ్నించకపోవడం, రేవంత్ రెడ్డి వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News