Friday, December 20, 2024

మహువాపై వేటు!

- Advertisement -
- Advertisement -

ఒకేలా కనిపించే అన్ని సందర్భాలు ఒకటి కానక్కరలేదు. గతంలో స్టింగ్ ఆపరేషన్‌కి దొరికిపోయిన ‘పైసాకు పార్లమెంటులో ప్రశ్నల’ వ్యవహారం, ఇప్పటి మహువా మొయిత్రా ఉదంతం ఒకేలా కనిపిస్తున్నప్పటికీ తేడా చాలా ఉంది. 2018 లో ఆరుగురు బిజెపి ఎంపిలు సహా 10 మంది లోక్‌సభ సభ్యులు కోబ్రా పోస్ట్ అనే డిజిటల్ పోర్టల్ పన్నిన ఆపరేషన్ దుర్యోధన అనే స్టింగ్ వలలో చిక్కుకొన్నారు. లంచం తీసుకొని యుపికి చెందిన ఒక కల్పిత కంపెనీ తరపున ప్రశ్నలు అడగడానికి అంగీకరించి దొరికిపోయారు. వారి లోక్‌సభ సభ్యత్వాలను అప్పటి స్పీకర్ సోంనాథ్ చటర్జీ రద్దు చేశారు. ఇప్పుడు అటువంటి స్టింగ్ ఆపరేషన్ జరగలేదు. పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ ఎంపి మహువా మొయిత్రా లంచం తీసుకోడం గాని, అందుకు ఒప్పుకోడం గాని జరిగినట్టు సాక్ష్యాధారాలు లేవు. వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి లంచం తీసుకొని అదానీ గ్రూపుపై ఆరోపణలతో లోక్‌సభలో ప్రశ్నలు వేశారని బిజెపి ఎంపి నిశికాంత్ దూబే చేసిన ఆరోపణను ఎథిక్స్ కమిటీ ఆమోదించి సిఫారసు చేయడంతో శుక్రవారం నాడు స్పీకర్ ఓం బిర్లా ఆమె సభ్యత్వాన్ని రద్దు చేశారు.

మహువా మొయిత్రా పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణ నగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ప్రధాని మోడీ ప్రభుత్వంపై సభలో నిర్భయంగా దండెత్తి ఫైర్ బ్రాండ్ ఎంపిగా పేరు గడించారు. సుప్రీం కోర్టు న్యాయవాది జై అనంత్ దేహాద్రాయ్‌తో గల వ్యక్తిగత సంబంధాలు బెడిసికొట్టడంతో అతడు కక్షగట్టి అందించిన సమాచారం మేరకు నిశికాంత్ దూబే ఈ ఆరోపణలను మహువా మొయిత్రాపై చేశారని వెల్లడైంది. దుబాయ్‌లో వుంటున్న హీరానందాని వ్యాపార ప్రయోజనాల కోసమే ఆమె లోక్‌సభలో అనేక ప్రశ్నలు వేశారని నిశికాంత్ దూబే ఆరోపించారు. అయితే 2019లో లోక్‌సభకు ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 62 ప్రశ్నలు వేశారని అందులో 12 మాత్రమే అదానీ కంపెనీలకు సంబంధించినవని తెలుస్తున్నది. ఈ 12 ప్రశ్నలలోనూ రెండు ప్రత్యక్ష ప్రశ్నలు అదానీ కంపెనీలకు సంబంధించినవి కాగా, నాలుగు ప్రశ్నలను ఆ గ్రూప్‌కి చెందిన ధమ్రా రేవుపైన, అయిదు హీరా నందానీకి ప్రయోజనాలున్న కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్‌పైన అడిగినవని తెలుస్తున్నది.

మొయిత్రా అడిగిన 50 ప్రశ్నలు హీరా నందానీ గ్రూప్ ప్రయోజనాలను కాపాడడానికి ఉద్దేశించినవేనని జై అనంత్ దేహద్రాయ్ సిబిఐకి చేసిన ఫిర్యాదులో ఆరోపించారు. హీరానందానీ గ్రూపు, దగ్గరుండి రాయించి మహువా చేత లోక్‌సభకు పోస్టు చేయించిందని నిశికాంత్ దూబే, దేహద్రాయిలు పేర్కొన్న ప్రశ్నలలో చాలా వరకు ఆ కంపెనీలకు సంబంధించినవే కావని తేలింది. ప్రధాని నరేంద్ర మోడీని ఇరకాటంలో పెట్టే విధంగా సభలో మాట్లాడినందుకే మహువాపై బహిష్కరణ వేటు వేశారన్న అభిప్రాయాన్ని కొట్టి పారేయలేము. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీని లోక్‌సభ సభ్యత్వం నుంచి బహిష్కరించిన తర్వాత మహువాపై తీసుకొన్న చర్య అదే రీతిని తలపించడం సహజం. మహువా మొయిత్రా 2022-23 బడ్జెట్ అనుబంధ పద్దులపై లోక్‌సభలో 2022 డిసెంబర్‌లో మాట్లాడుతూ పారిశ్రామిక ఉత్పతి గురించి ప్రధాని మోడీ ప్రభుత్వం అబద్ధాలు చెబుతున్నదని ఘాటుగా విమర్శించారు. దేశ పారిశ్రామిక సూచీని తెలిపే 17 పారిశ్రామిక రంగాలు ఉత్పత్తి దెబ్బతిని కూలబడ్డాయని ఎత్తి చూపారు.

2021 అక్టోబర్‌లో 3.3 శాతం వృద్ధిని నమోదు చేసిన పారిశ్రామిక రంగం 2022 అక్టోబర్‌లో 5.6 శాతం లోటులో ఉందని అన్నారు. ఈ గణాంకాలు అసలు ‘పప్పు’ ఎవరో చాటుతున్నాయన్నారు. రాహుల్ గాంధీని అవహేళన చేయడానికి బిజెపి వారు ‘పప్పు’ పదాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. వ్యాపారుల మీద, పట్టు పలుకుబడి గల రాజకీయ ప్రముఖుల పైన ఇడి కత్తి వేళ్లాడుతున్న ప్రస్తుత నేపథ్యంలో దేశంలో టెర్రర్ వాతావరణం నెలకొన్నదని కూడా విమర్శించారు. ప్రధాని మోడీ ఒక గవర్నర్ (కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్)ను మౌనం పాటించాలి అని మందలించిన సందర్భాన్ని గుర్తు చేస్తూ మణిపూర్ కల్లోలంపై మనది ‘మౌనం పాటిస్తున్న రిపబ్లిక్’ అని మహువా ఎత్తి పొడిచారు. ఆమెపై వచ్చిన ‘ప్రశ్నకు పైసా’ ఆరోపణ మీద ప్రతిపక్షాలు కోరినట్టు సభలో చర్చ జరిపించి ఉండాల్సింది.

అలాగే సమాధానం చెప్పుకోడానికి ఆమెకు అవకాశం ఇచ్చి ఉండాల్సింది. అలా చేయకుండా గతంలో సోమ్‌నాథ్ చటర్జీ తీసుకొన్న వైఖరిని పాటిస్తున్నామని చెప్పి మహువా సభ్యత్వాన్ని రద్దు చేయడం ఏకపక్ష చర్యగానే పరిగణన పొందుతుంది. ఆమెను బహిష్కరించడం ద్వారా బిజెపి కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడిందని, ప్రజాస్వామ్యానికి బై పాస్ సర్జరీ చేసిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్య అసమంజసమైనది ఎంత మాత్రం అని అనలేము.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News