మధ్యప్రదేశ్‌లో వ్యక్తి అరెస్టు
ఖండ్వా(మధ్యప్రదేశ్): తమిళనాడులోని కూనూరు సమీపంలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సిడిఎస్) జనరల్ బిపిన్ రావత్ దంపతులు, ఇతరులపై ఫేస్‌బుక్‌లో అనుచిత వ్యాఖ్యలు రాసిన ఒక వ్యక్తిని మధ్యప్రదేశ్‌లో పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో జనరల్ రావత్, ఆయన సతీమణి మధులిక, మరో 11 మంది సైనికాధికారులు మరణించిన విషయం తెలిసిందే. గురువారం సోషల్ మీడియా ఫేస్‌బుక్‌లో వచ్చిన వ్యాఖ్యలపై తమకు ఫిర్యాదు అందడంతో ఆ వ్యాఖ్యలు రాసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి శుక్రవారం అరెస్టు చేసినట్లు ఖండ్వా ఎస్‌పి వివేక్ సింగ్ విలేకరులకు తెలిపారు. నిందితుడిని దుర్గేష్ వస్కేలేగా గుర్తించినట్లు ఆయన చెప్పారు. మా వాళ్లు 14 మందిని నువ్వు చంపావు..ఇందుకు బదులుగా ప్రకృతి మీ 13 మంది సైనికులను కబళించింది అంటూ వస్కేలే తన ఫేస్‌బుక్ పోస్టులో వ్యాఖ్యానించినట్లు ఎఫ్‌ఐఆర్‌లో నమోదైంది. నాగాలాండ్‌లో భద్రతా దళాలు 14 మంది పౌరులను కాల్చివేయడాన్ని అతను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.