ఖమ్మం : లోక్‌సభలో శుక్రవారం బీఆర్‌ఎస్ లోక్‌సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు నామా నాగేశ్వరావు యూరియా సమస్యను పెద్ద ఎత్తున లేవనెత్తి, ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపి నామా యూరియా సమస్యపై తెలంగాణ బిడ్డగా అన్నదాతల తరఫున తీవ్ర స్థాయిలో గర్జించడం చర్చ నీయాంశమైంది. తెలంగాణాతో సహా దేశ వ్యాప్తంగా యూరియా సమస్యతో రైతాంగం అవస్థపడుతుంటే కేంద్రం ఏం చేస్తుందని నామా నిలదీశారు. ఒక్క తెలంగాణలోనే కాకుండా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని అన్నదాతలు యూరియా లభించక తిప్పలు పడుతున్నా కేంద్రానికి పట్టకపోవడమేమిటని తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. వ్యవసాయ సీజన్‌లో వ్యవసాయ రంగంలో రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారన్నారు.
ఇంత జరుగుతున్నా కేంద్రం ఏమీ పట్టనట్లు వ్యవహరించ డమేమిటని ధ్వజ మెత్తారు.తెలంగాణతో సహా దేశ వ్యాప్తంగా యూరియా కొరత నివారించేందుకు కేంద్రం తీసుకున్న చర్యలేమిటని ప్రశ్నించారు. రైతులందరికీ యూరియా సరఫరా చేసేందుకు ఏమేమి చర్యలు తీసుకున్నారో.. ఇందుకు సంబంధించి కేంద్రం వద్ద ఉన్న సమగ్ర ప్రణాళికను వెల్లడించాలని నామా పట్టుబట్టారు. తాను యూరియా సమస్యపై వివరాలు అడిగితే కేంద్రం సరైన సమాధానం ఇవ్వలేదన్నారు. అసలు దేశ వ్యాప్తంగా ఎంత యూరియా కావాల్సి ఉంది? ఇందుకు సంబంధించి కేంద్రం వద్ద ఉన్న కార్యాచరణ ఏమిటని ప్రశ్నించారు. యూరియాపై సబ్సిడీకి సంబంధించి గత ఐదేళ్లలో రాష్ట్రాలకు ఇచ్చిన సబ్సిడీ మొత్తం వివరాలను రాష్ట్రాలు, కేంద్ర ప్రాంతాల వారీగా సమగ్రంగా ఇవ్వాలని కోరితే అసమగ్రంగా ఇచ్చారని, ఇది కరెక్ట్ కాదన్నారు.
నూతన యూరియా పాలసీ విధానం తీసుకువచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏం ప్రగతి సాధించారో తెలియజేయాలని కేంద్రాన్ని గట్టిగా నిలదీశారు. సప్లిమెంటరీ ప్రశ్న అడుగుతూ రైతులు పడుతున్న ఇబ్బందులపై సభలో మాట్లాడితే ఆక్షేపిస్తున్నారని, దేశంలో అన్నదాతల ఆక్రందనలను కేంద్రం దృష్టికి తీసుకువస్తుంటే రాజకీయాలు చేస్తున్నారని అనడం సబబుగా లేదన్నారు. దేశంలో ఎక్కడా 100 శాతం యూరియా సరఫరా జరగడం లేదన్నారు. దిగుమతులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తెలియ జేయాలని నామా డిమాండ్ చేశారు. దేశంలో ప్రతి రైతుకు, ప్రతి ఎకరాకు యూరియా అందించేందుకు తీసుకున్న చర్యలేమిటని ప్రశ్నించారు. ఈ సందర్బంగా కేంద్ర ఎరువుల శాఖా మంత్రి మన్సుఖ్ మాండవియ ఇచ్చిన సమాధానంపై నామా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
గత ఐదేళ్లలో ఎరువులపై రాష్ట్రాల వారీగా ఇచ్చిన సబ్సిడీ వివరాలను అడిగితే సమగ్ర సమాచారం ఇవ్వకుండా సింపుల్‌గా ఇవ్వడాన్ని తప్పుబట్టారు. ఎరువులను స్వదేశీయంగా ఉత్పత్తి చేయడంతో పాటు దిగుమతుల ద్వారా యూరియా సరఫరాను మెరుగుపర్చామని, ఈ సందర్భంగా మంత్రి చెప్పుకొచ్చారు. నూతన యూరియా ఫాలసీ దేశాన్ని స్వయం సమృద్ధిగా చేయడానికి దోహదపడు తుందన్నారు. 2018/19లో ఎరువులపై రూ.73,435.21 కోట్ల సబ్సిడీ ఇచ్చామన్నారు. అలాగే 2021/22లో రూ. 1,57,640.09 కోట్లు, 2022/23లో రూ .2,54,798.93 కోట్లు సబ్సిడీగా ఇచ్చినట్లు చెప్పిన కేంద్ర మంత్రి రాష్ట్రాలు, కేంద్ర ప్రాంతాల వారీగా గణంకాలు వెల్లడించకపోవడం పట్ల ఎంపి నామా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
మణిపూర్‌పై బిఆర్‌ఎస్ ఎంపిల ధర్నా
మణిపూర్ పై చర్చ విషయంలో ఎన్డీయే ప్రభుత్వం కావాలని అవలంభిస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ శుక్రవారం న్యూఢిల్లీ పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద బిఆర్‌ఎన్ పార్టీ ఎంపిలు పార్టీ పార్లమెంటరీ నేత కే.కేశవరావు, లోక్ సభ లీడర్ నామా నాగేశ్వరరావు నేతృత్వంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. సేవ్ మణిపూర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎంపిలు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్య సమాఖ్య స్పూర్తికి గొడ్డలి పెట్టులాంటి ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ బిల్లు అప్రజాస్వామికమని నిరశించారు. ఎన్డీయే ప్రభుత్వం పెడరిలిజాన్ని ఖూనీ చేస్తుందని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే సుప్రీం అని నామా అన్నారు.
ప్రజా ప్రభుత్వాన్ని కాదని, ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం సమాఖ్య న్పూర్తికి విరుద్ధమని నామా స్పష్టం చేశారు. అందుకే బిఆర్‌ఎన్ పార్టీ కేంద్ర వైఖర్ని తీవ్రంగా వ్యతిరేకి స్తుందన్నారు.ఏ మాత్రం ప్రజాస్వామ్య విలువల మీద గౌరవం ఉన్నా సత్వరమే ఢిల్లీ ఆర్డినెన్స్ ను రద్దు చేయాలని నామా కేంద్రాన్ని కోరారు. ‘రక్షించాలి.., రక్షించాలి.. మణిపూర్ రాష్ట్రాన్ని, అక్కడి ప్రజల్ని రక్షించాలని రక్షించాలి‘,‘ఉపసంహరించాలి…, ఉపసంహరించాలి ఉద్యోగులపై ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలను తగ్గిస్తూ ప్రవేశపెట్టిన బిల్లును ఉపసంహరించాలి.., ఉపసంహరించాలి’ అంటూ బిఆర్‌ఎస్ ఎంపిలు ప్లకార్డులు చేతబట్టి ముక్తకంఠంతో నినదించారు. ఈ ధర్నాలో లోక్ సభ, రాజ్యసభ ఎంపిలు జోగినేపల్లి సంతోష్ కుమార్, వద్ది రాజు రవిచంద్ర, కొత్త ప్రభాకర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, పోతుగంటి రాములు, మన్నె శ్రీనివాసరెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, బండి పార్ధసారధిరెడ్డి. సురేష్ రెడ్డి, దివికొండ దామోదరరావు, తదితరులు పాల్గొన్నారు.