Monday, January 20, 2025

దేశాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్న కేంద్రం..

- Advertisement -
- Advertisement -

MP Nama Nageswara Rao slams Centre in Lok Sabha

దేశాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్న కేంద్రం
తెలంగాణ తీసుకున్న రుణాలతో కొత్తగా ఆస్తులను సృష్టించాం
కేంద్రం అప్పు రూ .100 లక్షలు కోట్లు ఏం చేసింది ?
పెరిగిన ధరలతో పేదల బతుకులు మరింత చిద్రం
తెలంగాణ ఒక్క రూపాయి డిఫాల్ట్ లేదు
ఆర్‌బిఐ నిబంధనలతోనే రాష్ట్రం లావాదేవీలు
పెరిగిన ధరలతో రైతులపై మరింత భారం
పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు అంశంపై లోక్ సభలో జరిగిన చర్చలో టిఆర్‌ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న రుణాలతో కొత్తగా ఆస్తులను సృష్టిస్తుంటే… కేంద్రం మాత్రం ఉన్న ఆస్తులను తెగ నమ్మి దేశాన్ని మరింత అప్పుల ఊబిలోకి నెడుతుందని టిఆర్‌ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు ఆరోపించారు. ధరల పెరుగుదల అంశంపై సోమవారం లోక్ సభలో జరిగిన చర్చలో నామ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులు, పవర్ ప్లాంట్లు, తాగునీటి ప్రాజెక్టులు చేపట్టి వాటి కోసం తీసుకున్న రుణాలు ఖర్చు చేసి ఇంటింటికీ తాగు అందిస్తోందన్నారు. ఇదే అంశంపై గతంలో అనేక వందలసార్లు సభలో చర్చకు వచ్చిందన్నారు. ఇందులో తెలంగాణనే నెంబర్ వన్ అని కేంద్రం పలుమార్లు చెప్పిందని ఈ సందర్భంగా నామా గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం చేసే లావాదేవీలన్నీ ఆర్‌బిఐ నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయన్నారు. తెలంగాణ ఒక్క రూపాయి కూడా డిఫాల్ట్ లేదని స్పష్టం చేశారు.

2014లో దేశం అప్పులు రూ.56 లక్షల కోట్లు ఉంటే ఇప్పుడది రూ.100 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. ఈ అప్పుతో ఎటువంటి సాగునీటి ప్రాజెక్టులు కొత్తగా కట్టిందో, ఏఏ ప్రాజెక్టులు కొత్తగా చేపట్టిందో కేంద్రం ప్రజలకు తెలియజేయాలని నామా డిమాండ్ చేశారు. కొత్తగా ఆస్తులు పెంచకపోగా ఉన్న వాటిని సైతం యధేచ్చగా అమ్మేస్తున్నారని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ ఎనిమిదేళ్లలో దేశంలో నిత్యావసర వస్తువులు, పెట్రో ఉత్పత్తుల ధరలు గణనీయంగా పెరిగాయన్నారు. ధరల పెరుగుదల వల్ల పేదలు మరింత పేదలుగా మారుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ధరలు పెరగలేదని సభలో కొందరు చెప్పడం సరికాదన్నారు.
నిత్యవర సరుకులు, పెట్రో గ్యాస్ ధరలు ఎడాపెడా పెంచారని, ప్రస్తుతం గ్యాస్ బండ ధర రూ.1100 దాటడంతో పేదలు ఉక్కిరిబిక్కిరవుతున్నారని విమర్శించారు. ఇలా ధరలు పెంచుకుంటూపోతే పేదలు ఎలా బతుకుతానికి కేంద్రాన్ని నిలదీశారు. ధరలు వల్ల పేదలు జీవన వ్యయం బాగా పెరిగి, వారి జీవితాలు మరింత దుర్భరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆఖరికి రోగులు తినే బ్రెడ్, పాలు, పాల పదార్థాలు, పిల్లలు వాడే పెన్సిల్, రబ్బర్ వంటి వాటిని దేనిని వదలకుండా పన్నులు వేయడం శోచనీయమన్నారు.
దేశంలో అన్నం పెట్టే శక్తి రైతుకు మాత్రమే ఉందని, పెట్రో డీజిల్ ధరలు ఎరువుల ధరలు పెంచి రైతులపై మరింత భారం పెంచారని నామా కేంద్రంపై విరుచుకుపడ్డారు. వీటి పెరుగుదల వల్ల రైతులపై మరింత భారం పెరిగిందన్నారు. పైగా రైతులకు ఎకరాకు పెట్టుబడి ఖర్చు రూ. 2 వేలకు పైగా పెరిగిందన్నారు. హ్యాండ్లూమ్‌పై పన్ను పెంచడం వల్ల ఆ రంగంమరింత కష్టాల్లోకి నెట్టబడిందన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా గోధుమ, బియ్యం ఉత్పత్తి తగ్గిందని కానీ తెలంగాణలో వంద శాతం ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా గోధుమ ఉత్పత్తి ఒక శాతం తగ్గిందన్నారు. కానీ దేశంలో ఉత్పత్తి మాత్రం బాగా ఉందని కేంద్రం చెబుతోందని, రైస్ కూడా ప్రపంచ వ్యాప్తంగా 0.5 శాతం ఉత్పత్తి తగ్గిందన్నారు. కానీ దేశంలో బియ్యం ఉత్పత్తి వంద శాతం పెరిగిందన్నారు. అది తెలంగాణ రాష్ట్రం నుంచే పెరిగిందన్నారు. వంద శాతం బియ్యం ఉత్పత్తి పెరిగినా దాన్ని కేంద్రం కొనడం లేదని మండిపడ్డారు. రైతుల నుంచి బియ్యం కొనకపోవడం వల్లనే తెలంగాణ రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సంసద్ ఆదర్శ్ యోజనకి సంబంధించి రాష్ట్రంలో పల్లెలు సత్తా చాటుతున్నాయని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తే మేము కూడా చప్పట్లు కొట్టి, స్వాగతిస్తామని నామ పేర్కొన్నారు.

MP Nama Nageswara Rao slams Centre in Lok Sabha

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News