లాభాలో ఉన్న ఎల్‌ఐసిని ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం ఏముంది?
కొత్తగా ఉద్యోగాలు ఇవ్వకపోగా…ఉన్న వాటిని కూడా ఊడగొడతారా!
కేంద్రం మరోసారి తన నిర్ణయాన్ని పునసమీక్షించుకోవాలి
లోక్‌సభలో కేంద్రాన్ని నిలదీసిన టిఆర్‌ఎస్ పార్లమెంటరీ పక్ష నాయకుడు నామ నాగేశ్వర్‌రావు
మన తెలంగాణ/హైదరాబాద్: భారీ లాభాల్లో ఉన్న ఎల్‌ఐసి సంస్థను ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని టిఆర్‌ఎస్ పార్లమెంటరీ పక్ష నేత నామ నాగేశ్వరరావు ప్రశ్నించారు. ఇది సరైన నిర్ణయం కాదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయాలన్న లక్షంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్లుగా కనిపిస్తోందన్నారు. కొత్తగా ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి ఉన్న ఉద్యోగాలనే ఊడగొట్టేందుకు కేంద్రం యత్నించడం శోచనీయమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయంలో కేంద్రం తన నిర్ణయాన్ని మరోసారి పున:సమీక్షించుకోవాలని సూచించారు. నాలుగు రోజుల విరామం తర్వాత పార్లమెంటు ఉభయసభల సమావేశాలు సోమవారం పునఃప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నామ మాట్లాడూతూ, ప్రభుత్వ రంగ బీమా సంస్థ అయిన ఎల్‌ఐసి ప్రైవేటీకరణ అంశంపై కేంద్రాన్ని ప్రశ్నించారు. ప్రైవేటీకరణ చేయడం వల్ల కేంద్ర ఖజానాతో పాటు సంస్థ ఉద్యోగులపై భారం పడుతుందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రైవేటీకరణతో ప్రభుత్వంపై పడే భారం ఏ మేరకు ఉంటున్నదన్న అంశాపై తగు సమాధానమివ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ థాకూర్‌ను కోరారు. దీనిపై సమగ్ర వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుతాన్ని ఆయన కోరారు. 2019-20220లో బీమా సంస్థకు సుమారు రూ. లక్షా 8వేల కోట్ల ఆదాయం లభించిందని నామ పేర్కొన్నారు.
ఇందులో కేంద్రం లాభం, పాలసీదారులకు చెల్లింపులు పోగా రూ.53,964 కోట్ల నగదు సంస్థ వద్ద ఉందని ఆయన తెలిపారు. ప్రస్తుతం సంస్థలో 1,13,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని నామ పేర్కొన్నారు. ఇప్పుడు వాటాల విక్రయంతో సంస్థకు నష్టం, ఉద్యోగ భయం ఉంటుందని పేర్కొన్నారు. ఈ అంశంపై సమాధానమివ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ థాకూర్‌ను నామ కోరారు. దీనిపై కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ స్పందిస్తూ, ప్రైవేటీకరణతో ఉద్యోగులకు, బీమా సంస్థకు ఎలాంటి నష్టం వాటిల్లదని పేర్కొన్నారు. పెట్టుబడుల ఉపసంహరణతో ఉద్యోగుల తొలగింపు ఉండబోదని ఈ సందర్భంగా ఆయన స్పష్టమైన హామి ఇచ్చారు. వాటాల విక్రయం వల్ల అదనపు నిధుల లభ్యతతో పాటు సంస్థ విస్తరణకు అవకాశం ఉంటుందని కేంద్ర మంత్రి భరోసా ఇచ్చారు. దీనిపై అనవసరంగా సభ్యులు ఆందోళన చెందాల్సన అవసరం లేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను మరింత సమర్థవంతంగా పనిచేయాలన్న తపనే కేంద్రానికి ఉందన్నారు. అంతే తప్ప ఉద్ధేశపూర్వకంగా లాభాల్లో ఉన్న వాటిని ప్రైవేటీకరణ చేసి ఉద్యోగాలను వీధినపడేయాల్సిన అవసరం మోడీ సర్కార్‌కు లేదన్నారు. కేంద్రం ఏదైనా నిర్ణయం తీసుకున్నదంటే దానిపై కూలంకషంగా చర్చించిన మీదట తుది నిర్ణయాని వస్తుందన్నారు. పైగా ఆ నిర్ణయం కూడా ఉద్యోగాలకు మేలు కలిగించే విధంగా ఉంటేనే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. దీనిపై ప్రతిపక్షాలు దురుద్దేశపూర్వకంగానే కేంద్రంపై లేనిపోని ఆరోపణలు చేయడం తగదని ఈ సందర్భంగా అనురాగ్ సింగ్ వ్యాఖ్యానించారు.
MP Nama question to Centre over LIC Privatised