Thursday, February 6, 2025

సంగారెడ్డి జిల్లాను మరో జవహర్ నగర్‌గా మార్చే కుట్ర:ఎంపి రఘునందన్‌రావు

- Advertisement -
- Advertisement -

జీహెచ్‌ఎంసీ అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సంగారెడ్డి జిల్లాను మరో జవహర్ నగర్‌గా మార్చేలా చేస్తున్న కుట్రను తీవ్రంగా ఖండిస్తున్నానని మెదక్ బిజెపి ఎంపీ రఘునందన్ రావు అన్నారు. హైదరాబాద్ నుంచి సంగారెడ్డి జిల్లా జిన్నారం, హత్నారా, పటాన్ చెరు ప్రాంతాల మధ్య ఉన్న 152 ఎకరాల ప్రభుత్వ భూమిని చెత్త డంపింగ్ కోసం ఉపయోగించేందుకు ప్రయత్నించడం ప్రజాభిప్రాయానికి వ్యతిరేకమని మండిపడ్డారు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో రఘునందన్ రావు మాట్లాడుతూ.. నల్లవల్లి అటవీ ప్రాంతంలో రోజుకు వెయ్యి లారీల చెత్తను తరలించి శుద్ధి పేరుతో పర్యావరణానికి ముప్పు తెచ్చే కార్యక్రమం నిర్వహిస్తున్నారని ఆరోపించారు.

ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న బిజెపి నాయకులను, ప్రజలను అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేసి సంగారెడ్డి జిల్లాలోని ఓ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు తరలించడం అన్యాయమని అన్నారు. జవహర్‌నగర్ మాదిరిగానే ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరు, జిన్నారం, గడ్డపోతారం ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి రాబోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతాలు ఇప్పటికే రసాయన పరిశ్రమల కాలుష్య ప్రభావంతో భూమి, నీరు కలుషితమయ్యాయని అన్నారు. ఇప్పుడు హైదరాబాద్ చెత్తను ఇక్కడకు తరలించడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. జీహెచ్‌ఎంసీకి చెత్తమీద చిత్తశుద్ధి ఉంటే, అధునాతన టెక్నాలజీని వినియోగించుకోవాలని అన్నారు. నల్లవల్లిలో చెత్త శుద్ధి పనులు వెంటనే ఆపకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News