Thursday, November 14, 2024

మణిపూర్ కంటే మోడీకి ఇజ్రాయెల్ ముఖ్యమా…

- Advertisement -
- Advertisement -

ఐజ్వాల్ : ప్రధాని నరేంద్ర మోడీకి మణిపూర్ కన్నా ఇజ్రాయెల్ పట్లనే ఆందోళన ఎక్కువ అని, ఇది చాలా సిగ్గుచేటని కాంగ్రెస్ నేత , ఎంపి రాహుల్ గాంధీ విమర్శించారు. ఓ వైపు దేశంలోని మణిపూర్ ఈ ఏడాది మే నెల నుంచి మండిపోతోంది. జనం నానా ఇక్కట్లకు గురి అవుతున్నారు. దీని గురించి పట్టించుకునే తీరిక ప్రధాని మోడీకి లేదు. అయితే ఇజ్రాయెల్‌పై ఆయనకు ఎక్కువగా దిగులు పట్టుకుందని రాహుల్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగే మిజోరంలో రాహుల్ రెండు రోజుల పర్యటన ఆరంభం అయింది. ఐజ్వాల్ వీధుల మీదుగా రెండు కిలోమీటర్ల పాదయాత్ర తరువాత రాహుల్ రాజ్‌భవన్ వద్ద జరిగిన బహిరంగ సభలో సోమవారం ప్రసంగించారు. పొరుగున ఉన్న మణిపూర్‌లో పరిస్థితి దారుణంగా ఉందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్ ఇంతకు ముందటిలాగా ఏక రాష్ట్రంగా లేదని, ఇప్పుడు తెగల ప్రాతిపదికన రెండుగా చీలిందని, ప్రస్ఫుటమైన విభజన రేఖలను సృష్టించింది ఎవరు? అనేది అందరికీ తెలుసునని స్పందించారు.

తీవ్రవాద ప్రభావిత ఈశాన్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శాంతిని నెలకొల్పిందని గుర్తు చేశారు. 1986లో కుదిరిన శాంతి ఒప్పందం ఘనత కాంగ్రెస్‌దే అన్నారు. మణిపూర్‌లో చాలా నెలలుగా మారణహోమం పరిస్థితి ఉంది. అక్కడ ప్రజలు హతులు అవుతున్నారు. మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. చివరికి శిశువులు చిన్నారులను కూడా చంపివేస్తున్నారని తెలిపారు. దీని గురించి కనీసంగా కూడా స్పందించకుండా ఉన్న మన మౌని ప్రధాని , భారత ప్రభుత్వానికి ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణపై చాలా ఆసక్తి ఉందని, ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారని, ప్రభుత్వ అధినేత ఇప్పటివరకూ అతలకుతలం అయి ఉన్న మణిపూర్‌ను సందర్శించకుండా ఉండటం సిగ్గు చేటని తెలిపారు. దేశంలో నెలకొన్న పలు సమస్యలకు మణిపూర్ ఓ ఉదాహరణ, ఇటువంటి జటిల సమస్యలు దేశంలోని పలు ప్రాంతాలలో విస్తరించుకుని ఉన్నాయని రాహుల్ స్పందించారు. మైనార్టీలు, ఆదివాసీలు, దళితులు పలు విధాలుగా క్లిష్టతను ఎదుర్కొంటున్నారు.

భారత ప్రజలపై వివిధ రూపాలలో అణచివేత , జులుం బాహాటంగానే సాగుతోందని, దీనిపై ఏం సమాధానం చెపుతారని నిలదీశారు. 40 మంది సభ్యుల మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కార్యక్రమంలో భాగంగా జరుగుతాయి. నవంబర్ 7వ తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్ తరువాత ఫలితాలు వెలువడుతాయి. ఇండియా అనే సమ్మిళిత ఆలోచనను ఇప్పుడు కాషాయ పార్టీ దెబ్బతీసేందుకు యత్నిస్తోందని తెలిపిన రాహుల్ ఈ క్రమంలో ఈ పార్టీ తన అధికార బలంతో వివిధ వర్గాలను, మతాలను, భాషలను ఎంచుకుని దాడికి పాల్పడుతోందని తెలిపారు. మిజోరంలో అధికారంలో ఉన్న మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్‌ఎఫ్) పలు కీలక విషయాలలో విఫలం చెందిందని, ఉద్యోగ కల్పనలో ఫెయిల్ అయింది. మాదకద్రవ్యాల రవాణాను అరికట్టలేకపోయింది. ప్రాధమిక మౌలిక వసతులను కల్పించలేకపోయిందని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని కాంగ్రెస్ నేత మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News