భోపాల్: మధ్యప్రదేశ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. 1200కు పైగా గ్రామాలు జలవిలయంతో దెబ్బతిన్నాయి. పలు చోట్ల అత్యంత వేగంగా దూసుకువచ్చిన వరదలతో గేట్లు ఇళ్లు దూర ప్రాంతాల వరకూ కొట్టుకుపొయ్యాయి. దాదాపు 6000 మంది వరకూ నిరాశ్రయులు అయ్యారు. 1950 మంది ఇప్పటికీ జలదిగ్బంధంలో చిక్కుపడ్డారు. తీవ్రస్థాయిలో కుండపోత వానలు పడటంతో పరిస్థితి దారుణంగా మారిందని రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బుధవారం తెలిపారు. దాదాపు ఆరు వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
సైన్యం, ఎన్‌డిఆర్‌ఎఫ్, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలను రంగంలోకి దింపినట్లు సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. పలు ప్రాంతాలలో ఇప్పటికీ జనం చుట్టూ వరదల మధ్య బందీగా మారారు. వీరిని కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. శివ్‌పురి, గ్వాలియర్ మధ్య రైలు ప్రయాణాలు, టెలికం సేవలు దెబ్బతిన్నాయి. బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి వరద తాకిడి ప్రాంతాలలో ఏరియల్ సర్వే చేపట్టారు. హెలికాప్టర్ల సాయంతో పలు ప్రాంతాలలో సహాయక చర్యలు శరవేగంతో సాగుతున్నాయి. మంగళవారం వాతావరణం అనుకూలించకపోవడంతో సహాయక చర్యలు నిలిచిపొయ్యాయి. అయితే పరిస్థితి కొంచెం మెరుగుపడటంతో బుధవారం తిరిగి గాలింపు చర్యలు చేపట్టారు.
MP Rain Fury Over 1200 villages hit by floods