వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ యంగ్ లీడర్ జాబితాలో టిడిపి ఎంపీ, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి స్థానం లభించింది. ప్రపంచవ్యాప్తంగా తమ రంగాల్లో ఉత్తమ నాయకత్వం కనబరిచిన యువ నాయకులను వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎంపిక చేస్తుంది. ఈసారి భారత్ నుంచి ఏడుగురు ఎంపికయ్యారు. దీనిపై రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ వరల్ ఎకనామిక్ ఫోరం ద్వారా ‘ యంగ్ గ్లోబల్ లీడర్’గా ఎంపిక కావడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమైన, ప్రభావితమైన నిర్ణయాలు తీసుకునే స్థానంలో భారత యువత ప్రాధాన్యం పెరుగుతోందన్నారు.
నిజాయితీ, నూతన ఆలోచనలతో ప్రజలకు సేవ చేయాలని ఈ గుర్తింపు మరింత గుర్తు చేస్తుందని ఆయన అన్నారు. 2014లో 26 ఏళ్ల అతి చిన్న వయసులో పార్లమెంట్ సభ్యుల్లో ఒకరిగా ఉన్న రామ్మోహన్ నాయుడు 2024 నుంచి ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో క్యాబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన నాయకత్వంలో పౌర విమానయాన శాఖ కొత్త పుంతలు తొక్కుతోంది. విమానాశ్రయాల్లో మౌలిక సదుపాయాల కల్పన నుంచి దేశంలోని వివిధ మారుమూల ప్రాంతాలకు వైమానిక సేవలను అభివృద్ధి చేసేందుకు ఆయన ఎంతో కృషి చేస్తున్నారు.